చంద్రబాబు, జగన్ కు మధ్య తేడా ఇదే.! ఛాట్ జీపీటీ ఆసక్తికర విశ్లేషణ ?
ప్రస్తుత ఏపీ రాజకీయాల్లో ఇద్దరు కీలక రాజకీయ నేతల పేర్లు చెప్పమంటే ముందుగా గుర్తుకొచ్చే పేర్లు చంద్రబాబు నాయుడు, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. వీరిద్దరి మధ్య ఎన్నో పోలికలు, వైరుధ్యాలు ఉన్నా అంతిమంగా ఇద్దరూ ఏపీ కేంద్రంగానే రాజకీయాలు చేస్తున్నారు. ఇద్దరూ రెండు ప్రాంతీయ పార్టీలకు అధినేతలుగా ఉన్నారు. ప్రస్తుతం ఏపీలో సీఎంగా చంద్రబాబు నాలుగోసారి కొనసాగుతుంటే, వైఎస్ జగన్ మాజీ ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేగా మాత్రమే ఉన్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు, వైఎస్ జగన్ మధ్య గూగుల్ ఛాట్ జీపీటీ పోలికను ఓసారి చూద్దాం..
వైఎస్ జగన్ 2019లో తొలిసారి ముఖ్యమంత్రి అయితే చంద్రబాబు మాత్రం 1995 నుంచి 2004 మధ్య రెండుసార్లు, 2014-19 మధ్య ఓసారి, ప్రస్తుతం నాలుగోసారి ముఖ్యమంత్రిగా ఉన్నారు. తండ్రి వైఎస్ వారసత్వం నుంచి జగన్ రాజకీయ పునాది వేసుకుంటే చంద్రబాబు మాత్రం ఎన్టీఆర్ వారసత్వంతో వచ్చినా స్వయంగా పార్టీ అధినేతగా ఎదిగారు. పాలనా ధోరణుల్ని గమనిస్తే జగన్ ప్రధానంగా సంక్షేమ పథకాలపై, నవరత్నాలపై దృష్టిపెట్టారు. చంద్రబాబు మాత్రం అభివృద్ధి, టెక్నాలజీ, మౌలిక వసతులపై ఫోకస్ పెట్టారు.

ప్రజలతో అనుసంధానం విషయంలో జగన్ గ్రామాల్లో సైతం సచివాలయం, వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేయగా.. చంద్రబాబు టీవీ, మీడియా, శిల్పారావం వంటి కార్యక్రమాలతో దగ్గరయ్యారు. జగన్ ఆర్ధిక విధానం డబ్బును నేరుగా ప్రజలకు నేరుగా అందించే డీజీటీ పథకాలు అయితే చంద్రబాబు విధానం మాత్రం పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలకు ప్రాధాన్యంగా ఉంది. జగన్ బలహీనతల్లో పెట్టుబడులపై కాస్త దృష్టి లేకపోవడం అయితే చంద్రబాబుకు సంక్షేమంపై దృష్టి లోపించిందని తెలిపింది. చంద్రబాబు ఎక్కువగా పీఆర్ ఆధారిత పాలన చేస్తారని వెల్లడించింది.
పబ్లిక్ స్పీకింగ్ విషయంలో జగన్ ది భావోద్వేగాత్మకంగా మాట్లాడే శైలి అయితే చంద్రబాబుది గణాంకాలు, విజన్ తో మాట్లాడే శైలిగా అభివర్ణించింది. అలాగే జగన్ అభిమాన వర్గం పేద, మధ్యతరగతి, మహిళలు, రైతులు అయితే చంద్రబాబు అభిమానవర్గం నగరవాసులు, విద్యావంతులు, వ్యాపార వర్గంగా తెలిపింది. ఇలా ఇరువురు నేతలకూ మధ్య పోలికలతో పాటు వైరుధ్యాలు కూడా ఉన్నట్లు చాట్ జీపీటీ విశ్లేషించింది.












Click it and Unblock the Notifications