వాట్సప్‌లో ఎర్రదొంగలు: నిన్ననీతు నేడు చైనా మహిళ
హైదరాబాద్: ఎర్ర చందనం స్మగ్లర్లు వాట్సప్ ద్వారా అక్రమ కార్యకలాపాలు సాగిస్తున్నారు. విదేశీ, ఇతర రాష్ట్రాల్లో స్మగ్లర్లకు సరకు వివరాలను చిత్రాలతో సహా ఎప్పటికి అప్పుడు చేరవేసేందుకు, ఆర్డర్లు పొందేందుకు వాట్సప్‌ను వినియోగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
హైదరాబాదులో పట్టుబడడ్ చైనా దేశీయుడు యాంగ్ పాంగ్, పశ్చిమ బెంగాల్లో పట్టుబడ్డ సౌందర్ రాజన్, శరవణన్‌ల సెల్ ఫోన్లను పరిశీలించారు. వారిని విచారించినప్పుడు ఈ విషయాలు వెలుగు చూశాయి. రహస్య స్థావరాలు, గోదాముల్లో నిల్వ చేసిన దుంగలు ఏ గ్రేడుకు చెందినవి, వాటి నాణ్యత, ప్రత్యేకతల తదితర పూర్తి వివరాలను స్మగ్లర్లు ఫోన్లలో చిత్రాలు తీసి వాటిని వాట్సప్ ద్వారా బడా స్మగ్లర్లకు పంపిస్తున్నారు.
ఏడుగురు అంతర్జాతీయ స్మగ్లర్లు రాజస్థాన్, కోల్‌కతా, ఢిల్లీలను షెల్టర్ జోన్లుగా మార్చుకున్నారు. ఏపీ నుంచి బెంగళూరు, మైసూరు కేంద్రాలుగా ఎర్రచందనం దుంగలను విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. వీరి కోసం తిరుపతి, చిత్తూరు టాస్క్‌ఫోర్స్ బృందాలు వేట మొదలు పెట్టాయి. ఆ ఏడుగురు అంతర్జాతీయ స్మగ్లర్ల చిరునామాలు, ఫొటోలనూ పోలీసులు సేకరించినట్లు తెలిసింది.

నెల్లూరు జైలుకు యాంగ్ పాంగ్
ఎర్ర చందనం అక్రమ రవాణా కేసులో చిత్తూరు, తిరుపతి పోలీసులు అరెస్టు చేసిన చైనా దేశస్థుడు యాంగ్ పాంగ్‌ను నెల్లూరు కేంద్ర కారాగారానికి తరలించారు.
నిన్న నీతూ అగర్వాల్.. తాజాగా ఓ చైనా మహిళ.. ఎర్రచందనం అక్రమ రవాణా వ్యవహారంలో ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారని తెలుస్తోంది. రెండు రోజుల క్రితం టూరిస్టు వీసాపై వచ్చి హైదరాబాద్‌లో ఎర్రచందనం కొనుగోలుకు ప్రయత్నించిన చైనీయుడు యాంగ్ పాంగ్‌ను ఏపీ పోలీసులు అరెస్టు చేశారు.
అదే సమయంలో ఎర్రచందనం కేసులో అరెస్టైన శ్రీనివాసరాజు ఇచ్చిన సమాచారం ప్రకారం.. బెంగళూరులో నివసించే ఓ చైనా మహిళ కూడా ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించినట్లు పోలీసులకు తెలుస్తోంది. ఆమె కోసం ఏపీ పోలీసులు కర్ణాటకలో గాలిస్తున్నారు.












Click it and Unblock the Notifications