చంద్రబాబు ఫోన్ కాల్ తో జోష్ లో చింతమనేని ప్రభాకర్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నామినేషన్ల పర్వం కొనసాగుతుంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సీట్ల సర్దుబాటు విషయంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఒక పక్క నామినేషన్ల దాఖలుకు నేడు, రేపు మాత్రమే గడువు ఉండటంతో నేతలంతా హడావిడి పడుతున్నారు. కొన్ని స్థానాల్లో కూటమి అభ్యర్థుల విషయంలో సమస్యలు కొలిక్కి రావటం లేదు. కూటమి పొత్తుల నేపథ్యంలో సీట్ల సర్దుబాటు అంశం చంద్రబాబుకు పెద్ద టాస్క్ గా మారింది.
ఎవరూ హర్ట్ కాకుండా బీ ఫామ్స్ ఇస్తున్న చంద్రబాబు
అయితే చంద్రబాబు దాదాపు అన్నిస్థానాల్లో సీట్ల సర్దుబాటు చేసి బీఫామ్ లను అందజేస్తున్నారు. ఒకపక్క అభ్యర్థులు నామినేషన్లు వేస్తుంటే మరోవైపు అనపర్తి, దెందులూరు బిఫామ్ లు ఎవరికి ఇవ్వాలి అన్న దానిపైన మల్లగుల్లాలు పడిన చంద్రబాబు చివరికి చాలా జాగ్రత్తగా ఎవరూ హర్ట్ కాకుండా ప్లాన్ చేశారు. మొదట నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అనపర్తి నుండి టీడీపీ తరపున పోటీచేస్తారని భావిస్తే సీట్ల సర్దుబాటులో ఆ స్థానం బీజేపీకి ఇవ్వాల్సి వచ్చింది.

చింతమనేనికి చంద్రబాబు ఫోన్
అందుకు నల్లమిల్లి అంగీకరించకపోవటంతో దెందులూరు బీజేపీకి ఇద్దామని ఆలోచించారు. అక్కడ చింతమనేని ససేమిరా అనటంతో నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని బిజెపిలోకి పంపి అనపర్తి నుంచి టికెట్ ఇప్పించారు. దీంతో దెందులూరు సీటు విషయంలోనూ నెలకొన్న సందిగ్ధతకు కూడా చెక్ పడింది. ఈ క్రమంలోనే టిడిపి అధినేత చంద్రబాబు తాజాగా చింతమనేని ప్రభాకర్ కు ఫోన్ చేసి తన దగ్గరకు రమ్మని పిలిచారు.
శ్రీకాకుళం వెళ్లి చంద్రబాబును కలవనున్న చింతమనేని
ప్రస్తుతం చంద్రబాబు శ్రీకాకుళం పర్యటనలో ఉండడంతో చింతమనేని ప్రభాకర్ శ్రీకాకుళం బయలుదేరారు. మొన్ననే భారీ ర్యాలీతో దెందులూరు టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేసిన చింతమనేని ప్రభాకర్ ఈరోజు చంద్రబాబును కలిసి తెలుగుదేశం పార్టీ నుండి బీఫామ్ తీసుకోబోతున్నారు. దెందులూరులో కొఠారి అబ్బయ్య చౌదరి ని టార్గెట్ చేసి ఎన్నికలలో దూకుడు చూపించాలని, గెలిచి తీరాలని ధృడ సంకల్పంతో ఉన్న చింతమనేనికి చంద్రబాబు ఫోన్ కాల్ తో కొత్త ఉత్సాహం వచ్చినట్టయ్యింది.












Click it and Unblock the Notifications