మెగా, నందమూరి అభిమానుల 'తెరవెనక' సమావేశం?
చిరంజీవి, బాలకృష్ణ ప్రత్యర్థులుగా తెలుగు చిత్ర పరిశ్రమలో పోటీపడేవారు. మూడు దశాబ్దాల నుంచి అదే కొనసాగుతోంది. తాజాగా మరోసారి సంక్రాంతికి ఇద్దరూ కోడిపుంజుల్లా ఢీకొట్టుకోవడానికి సిద్ధమయ్యారు. 'వాల్తేరు వీరయ్య', 'వీరసింహారెడ్డి' సినిమాలతో మరోసారి బాక్సీఫీస్ దగ్గర తమ హవా చూపించబోతున్నారు. ఉప్పు, నిప్పులా ఉండే ఈ ఇద్దరు హీరోల అభిమానులు ఇప్పుడు ఒక్కటయ్యారు.

ఎక్కువ థియేటర్లు 'వారసుడు'కే?
చిరంజీవి, బాలకృష్ణ సినిమాలను కాదని రేపు సంక్రాంతికి ఎక్కువ థియేటర్లు తమిళ చిత్రం 'వారసుడు'కు కేటాయించడమే దీనికి కారణం. థియేటర్లను లీజుకు తీసుకునే దిల్ రాజు ఈ సినిమా నిర్మాత కావడమే ఇందుకు కారణం. ఫిల్మ్ ఛాంబర్ కానీ, డిస్ట్రిబ్యూటర్లు కానీ 'వీరసింహారెడ్డి', 'వాల్తేర్ వీరయ్య'ను ప్రదర్శించడానికే ముందుకు వస్తున్నారు. ఇటువంటి తరుణంలో ఏం చేయాలనే విషయమై రాయలసీమ, ఆంధ్రలో ఈ ఇద్దరు హీరోల అభిమానులు తెరవెనక సమాలోచనలు జరుపుతున్నారు. సంక్రాంతికి చిరంజీవి, బాలకృష్ణ సినిమాలను కాదని తమిళ హీరో విజయ్ సినిమాలకు ఎక్కువ థియేటర్లు కేటాయిస్తే ఏం చేయాలి? దీనిని ఎలా ఎదుర్కోవాలి? ఎలా ప్రతిఘటించాలి? అనే దాని మీద అభిమాన సంఘాలు దృష్టి పెట్టాయి.

అల్లు అరవింద్ ను నేరుగా అడిగిన బాలకృష్ణ
ఇటీవల ప్రసారమైన అన్ స్టాపబుల్ షోలో కూడా బాలకృష్ణ నేరుగా అల్లు అరవింద్ ను తనకు ఎన్ని థియేటర్లు కేటాయిస్తున్నారని అడిగారు. ప్రస్తుతానికి అయితే వీటిపై చిరంజీవి, బాలకృష్ణ ఏమీ మాట్లాడటంలేదు. ఈ సమస్య వారి దృష్టిలో ఉన్నప్పటికీ వేచిచూసే ధోరణిని అవలంబిస్తున్నారు. నెలరోజుల సమయంఉంది కాబట్టి ఈలోగా ఏమైనా జరుగుతుందేమోనని అంటున్నారు. చిరంజీవి అభిమానులు ఇప్పటికే తమ బాస్ సినిమాకు అన్యాయం జరుగుతోందంటున్నారు. విడుదలకు సరైన తేదీ లేదంటున్నారు.

'వారసుడు' సినిమాకు అగ్రిమెంట్ చేసిన ఎగ్జిబిటర్లు
రాయలసీమ, ఆంధ్రలోని ఎగ్జిబిటర్లు 'వారసుడు' సినిమాకు అగ్రిమెంట్ చేశారు. కానీ వారంతా వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య ప్రదర్శించాలని కోరుకుంటున్నారు. వీరిద్దరూ స్థానిక కథానాయకులు కావడం, విజయ్ తమిళ కథానాయకుడు కావడంతో అతడి సినిమాకు అంత భారీస్థాయిలో ఓపెనింగ్స్ ఉండవని అంచనా వేసుకుంటున్నారు. మల్టీప్లెక్స్ లు కాకుండా సింగిల్ థియేటర్లు, డబుల్ స్క్రీన్ ఉన్న థియేటర్లను వారసుడుకు కేటాయిస్తే అభిమానులు తీవ్రంగా ప్రతిఘటించే అవకాశం ఉందని అప్పుడు నష్టపోయేది దిల్ రాజు కాదని, ఎగ్జిబిటర్లేనంటున్నారు. అనవసరపు రాజకీయాలు చేసి థియేటర్లు లేకుండా చేస్తే రేపు ఇబ్బంది పడేది నిర్మాతలేనని తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చెందిన వ్యక్తి ఒకరు వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications