చిరంజీవి ఒత్తిడి.. ఆస్తులమ్ముకుంటున్న భోళాశంకర్ నిర్మాత?
భోళాశంకర్ కు ఎటువంటి టాక్ వచ్చిందో అది ప్రదర్శింపబడుతున్న థియేటర్లను చూస్తేనే అర్థమవుతోంది. కనీసం ఒక్కరి నోటి నుంచైనా పర్వాలేదు అనే మాట కూడా రాలేదు. అంత 'అద్భుతంగా' మెహర్ రమేష్ సినిమాను తీశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ నోట విన్నా, ఎక్కడ నలుగురు చేరినా భోళాశంకర్ గురించి, చిత్ర దర్శకుడి గురించే చర్చ. ప్రేక్షకులపై అంతగా ప్రభావాన్ని చూపింది ఈ సినిమా.
చిరంజీవి రెమ్యునరేషన్ పూర్తిగా చెల్లించలేదని, ఈ విషయంలో నిర్మాతకు, చిరుకు మధ్య విభేదాలు తలెత్తాయని వార్తలు వస్తున్నాయి. ఇవ్వాల్సిన రెమ్యునరేషన్ ఇవ్వాలంటూ చిరంజీవి గట్టిగా అడిగారని, వాటిని చెల్లించేందుకు నిర్మాత తన ఆస్తులను తాకట్టు పెట్టాడంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ గా మారాయి.

చిరంజీవికి రూ.65 కోట్ల రెమ్యునరేషన్ అనుకున్నారని, అందులో రూ.50 కోట్లు మందే ఇచ్చేశారని, సినిమా విడుదలై డిజాస్టరైన తర్వాత రూ.15 కోట్లు ఇవ్వమని చిరు అడిగారని, దీంతో నిర్మాత తనకున్న ఆస్తులన్నింటినీ అమ్ముకుంటున్నాడని, తాకట్టు పెడుతున్నాడంటూ రకరకాల కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. నెటిజన్లు ఈ విషయంలో చిరంజీవిపై విమర్శలకు దిగారు. కొంతమంది మెగా అభిమానులు మాత్రం రూమర్లను ఖండించారు.
రెమ్యునరేషన్ విషయంలో చిరంజీవి తనపై ఒత్తిడి పెంచుతున్నారంటూ అనిల్ సుంకర్ అసహనం వ్యక్తం చేశారంటున్నారు. దీంతో అసలు విషయం కనుక్కోవడానికి ఒక అభిమాని నేరుగా అనిల్ సుంకరకే మెసేజ్ పంపించాడు. దీనికి సంబంధించిన వాట్సాప్ స్క్రీన్ చాట్ వైరలైంది. అనిల్ సుంకర చేసిన కామెంట్స్ చూపిస్తూ సార్.. ఇది నిజమేనా? అని ఆ అభిమాని అడిగారు.
తాను అమెరికాకు వెళుతున్నానని అనిల్ రిప్లై ఇచ్చినట్లు అందులో ఉంది. దీనికి సంబంధించిన వార్త వైరలవుతోంది.. కొద్దిగా చూడండి అని ఆ అభిమాని మెసేజ్ పెట్టారు. పట్టించుకోవద్దండి.. నేను మళ్లీ చిరంజీవిగారితో మరో సినిమా చేస్తాను.. ఆయన చాలా మంచివారు.. సినిమాతోనే సమాధానం చెబుదాం అని అనిల్ చెప్పినట్లుగా ఆ స్క్రీన్ షాట్ లో ఉంది. ఇప్పటికైనా ఆ వివాదానికి తెర పడుతుందో? లేదో? చూడాలి.












Click it and Unblock the Notifications