మోసపోయాం: విభజనపై చిరు, అవమానం: లగడపాటి

న్యూఢిల్లీ: పది జిల్లాల తెలంగాణ ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకోవడంతో సీమాంధ్ర కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు, మంత్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము మోసపోయామని కేంద్ర మంత్రి చిరంజీవి బహిరంగంగా వ్యాఖ్యానించారు. తనతోపాటు మిగిలిన వారు కూడా ఇదే అభిప్రాయంలో ఉన్నారని ఆయన తెలిపారు.

కేంద్ర మంత్రులు చిరంజీవి, పళ్లంరాజు, పురందేశ్వరి, కోట్ల సూర్యప్రకాశ రెడ్డి, ఎంపీలు లగడపాటి రాజగోపాల్, ఉండవల్లి అరుణ్‌కుమార్, అనంత వెంకట్రామిరెడ్డి, సాయిప్రతాప్, సబ్బం హరి, జీవీ హర్షకుమార్, రాయపాటి సాంబశివరావు శుక్రవారం పార్లమెంటులోనే తమ రాజీనామాలు సమర్పించాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

విభజన అనివార్యమని తెలిసి, తాము రాజీపడుతూ కొన్ని విజ్ఞప్తులు చేశామని, తమ విజ్ఞప్తులను కూడా పట్టించుకోలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ యూటీ, భద్రాచలం డివిజన్‌ను సీమాంధ్రకు అప్పగించడం, కనీసం పోలవరంలో ముంపునకు గురయ్యే ప్రాంతాలనైనా సీమాంధ్రలో కలపడం వంటి విన్నపాలేవీ పరిగణనలోకి తీసుకోకపోవడం అన్యాయమని వారంటున్నారు.

Chiranjeevi

మంత్రివర్గ సమావేశం తర్వాతా సీమాంధ్ర కేంద్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులు కావూరు సాంబశివరావు నివాసంలో నేతలు భేటీ అయ్యారు. మంత్రులు పళ్లం రాజు, పురందేశ్వరి, కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, జేడీ శీలం, కిల్లి కృపారాణి, ఎంపీలు లగడపాటి రాజగోపాల్, కేవీపీ రామచంద్రరావు, ఉండవల్లి అరుణ్‌కుమార్, అనంత వెంకట్రామిరెడ్డి, సబ్బం హరి, జీవీ హర్షకుమార్, ఎస్పీవై రెడ్డి తదితరులు ఈ భేటీలకు హాజరయ్యారు.

తమను అవమానించారని వారు అభిప్రాయపడుతున్నారు. కేంద్రం, కాంగ్రెస్ అధిష్ఠానం అత్యంత అవమానకరమైన రీతిలో వ్యవహరించాయని, ఉంటే ఉండండి.. పోతే పొండి అనే వైఖరి ప్రదర్శించాయని లగడపాటి ఆగ్రహం వ్యక్తం చేశారు. తమను పూచికపుల్లతో సమానంగా లెక్కకట్టారని, ఇంతకంటే దుర్మార్గం మరొకటి ఉండదని ఆవేదన వ్యక్తం చేశారు.

రాష్ట్ర విభజన బిల్లును టేబుల్ ఐటమ్‌గా పెట్టారని, వాస్తవానికి దాన్ని చదివేందుకే వారం రోజులు సమయం పడుతుందని, అలాంటిది రెండు రోజులు గడువు అడిగినా ఇవ్వలేదని, కనీసం గంట సమయం కూడా లేకుండా హడావుడి చేశారని అన్నారు. దీనికి ప్రతిగా శుక్రవారం పార్లమెంటులోనే కేంద్ర మంత్రులు, ఎంపీలు సభ సాక్షిగానే రాజీనామాలు సమర్పిస్తామని లగడపాటి చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+