అమ్మవారిని, అయ్యవారిని చూడటానికి రెండు కళ్లూ సరిపోవు
ధర్మస్వరూపుడు శ్రీరాముడు, ఆదర్శానికి ఆనవాలైన సీతాదేవి ఆలయం లేకుండా ఏ గ్రామం, పట్టణం, నగరం ఉండదు. సీతారాములు కొలువైన పవిత్ర క్షేత్రాల్లో ఉమ్మడి చిత్తూరు జిల్లా వాయల్పాడు పట్టాభి రామాలయం ఒకటి. రామాలయం అనగానే రాముడు, సీత, లక్ష్మణుడు, ఆంజనేయుడు కనిపిస్తాడు. కొన్ని క్షేత్రాల్లో మాత్రం భరత, శత్రఘ్నలుంటారు. అటువంటి క్షేత్రాల్లో వాయల్పాడు ఒకటి. ఇక్కడి స్వామివారిని జాంబవంతుడు ప్రతిష్టించాడని స్థల పురాణం చెబుతోంది.
ఏ రామాలయంలోనైనా స్వామివారికి ఎడమవైపున అమ్మవారుంటారు. ఇక్కడ మాత్రం అమ్మవారు కుడివైపు ఉండటం ఈ క్షేత్రం విశిష్టత. శ్రీరామనవమి సందర్భంగా 9 రోజులు ఉత్సవాలు జరుగుతాయి. అమ్మవారి నక్షత్రమైన ఆశ్లేష నక్షత్రం రోజున కల్యాణోత్సవం చేస్తారు. దీన్ని చూడటానికి రెండు కళ్లూ సరిపోవంటే అతిశయోక్తి కాదు. గర్భాలయంలో కొలువైన స్వామివారి సౌందర్యం వర్ణనాతీతం. ఇక్కడ రాములవారు ఖడ్గాలను ధరించి ఉంటారు. అందువల్ల ఆయన్ను ప్రతాప రామచంద్రుడు అంటారు. స్వామివారి దివ్య మంగళ రూపాన్ని అన్నమయ్య అనేకసార్లు సందర్శించడమే కాకుండా మహోన్నతంగా కీర్తించాడు.

మహోన్నతమైన మహర్షులు, మహా భక్తులు ఈ క్షేత్రాన్ని సందర్శించారు. పట్టాభి రామాలయాన్ని సందర్శించడంవల్ల సమస్త పాపాలు పోయి సకల శుభాలు చేకూరతాయంటారు. సువిశాలమైన ప్రదేశంలో.. అత్యంత ఆహ్లాదకర వాతావరణంలో అలరారుతున్న రాచమంద్రుణ్ని సందర్శించడంవల్లమనసుకు ఎంతో ప్రశాంతత చేకూరుతుంది. మహిమాన్వితమైన ఈ క్షేత్ర దర్శనంవల్ల అమోఘమైన, అద్భుత భక్తి భావాలకు మనసు కేంద్రంగా మారుతుంది.
జాంబవంతుడు ప్రతిష్టించి పూజించిన తర్వాత ఈ మూర్తులు మరుగున పడిపోయారు. వాల్మీకి మహర్షివల్ల పుట్టలో నుంచి బయటపడ్డాయి. ఇక్కడి కొండపై వాల్మీకి మహర్షి తపస్సు చేసుకోవడంతో ఈ ప్రాంతానికి వాల్మీకిపురం అనే పూరు కూడా వచ్చిందా. కాలక్రమంలో అదే వాయల్పాడుగా మారింది.












Click it and Unblock the Notifications