క్రిస్మస్ పండుగకు చేసే దానాలతో జీవితంలో వెలకట్టలేని ఆనందం!!
ఏసుక్రీస్తు పుట్టిన రోజును క్రిస్మస్ పర్వదినంగా క్రైస్తవులు అత్యంత ఘనంగా జరుపుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా ఈ వేడుకలను చాలా గ్రాండ్ గా జరుపుతారు. అయితే క్రిస్మస్ పండుగ సందర్భంగా మనం తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. క్రిస్మస్ పండుగ ప్రతి ఒక్కరి జీవితంలో సంతోషాన్ని తీసుకురావాలని చెబుతారు. అందుకే క్రిస్మస్ పండుగ సందర్భంగా చాలామంది శాంతా క్లాస్ వేషధారణలో ఎవరికి తెలియకుండా సహాయం చేస్తూ ఉంటారు.
క్రిస్మస్ పండుగ సందర్భంగా దానధర్మాలు చేస్తే జీవితం చాలా సుఖ సంతోషాలతో ఉంటుందని క్రైస్తవులు నమ్ముతారు. అందుకే క్రీస్తు పుట్టిన రోజున నిస్వార్ధంగా దేవునికి సేవ చేసే క్రమంలో, పేద ప్రజలకు దానధర్మాలు చేసి క్రీస్తు ఆశీస్సులు పొందాలని చాలామంది క్రిస్మస్ సందర్భంగా దానధర్మాలకు పెద్దపీట వేస్తారు. వివిధ రకాల బహుమతులు ఇస్తూ పేదల ముఖాల్లో నవ్వుల పువ్వులు పూయిస్తారు.

దానం చేయడం చాలా గొప్ప కార్యం. దాన ధర్మాలు వల్ల మనం చేసిన పాపాలు తొలగిపోయి, దానం చేసిన తాలూకు పుణ్యం మనకు వస్తుందని చాలామంది ప్రగాఢంగా విశ్వసిస్తారు. పవిత్రమైన క్రిస్మస్ రోజున పేదలకు, చిన్నారులకు శక్తి మేరకు బట్టలు, డబ్బులు, వస్తువులు దానం చేయాలని చెబుతారు. ఇలా చేయడం వల్ల ఏసుక్రీస్తు అనుగ్రహం లభిస్తుందని, తమ జీవితం పైన కూడా ఏసుక్రీస్తు వరాల జల్లు కురిపిస్తాడని ప్రగాఢంగా విశ్వసిస్తారు.
ఇక శాంతా క్లాస్ వేషధారణలో రహస్యంగా చిన్నారులకు, రోడ్లపై జీవిస్తున్న ఎవరూ లేని అనాధలకు, ఫుట్ పాత్ లపై జీవించే వారికి, రాత్రి వేళలో నిద్రిస్తున్న పేద పిల్లలకు బహుమతులు అందజేస్తారు. ఇలా ఎవరికి తెలియకుండా రహస్యంగా దానం చేయడం వల్ల మనిషికి ఆనందం కలగడం మాత్రమే కాకుండా, ప్రతిఫలాపేక్ష లేని దానం చేయడం వల్ల వారికి చాలా పుణ్యం లభిస్తుంది.
ఏసుక్రీస్తు తన బోధనలలో ప్రతి ఒక్కరు ప్రేమ, సద్భావన, క్షమాపణ, శాంతి ఉండాలని, రహస్య దానాలను ఇచ్చే గుణం ఉండాలని సూచించారు. తాము సంపాదించిన దానిలో కొంత భాగమైనా పేదలకు పంచాలని, దాని వల్ల కలిగే ఆనందం వెలకట్టలేనిదని ఏసుక్రీస్తు తన బోధనలలో చెప్పారు. అందుకే చాలామంది క్రీస్తు బోధనల మేరకు క్రిస్మస్ పర్వదినం సందర్భంగా దానధర్మాలు చేస్తూ ఉంటారు. క్రీస్తు దయ తమపై ఉండాలని కోరుకుంటారు.












Click it and Unblock the Notifications