ఎమ్మెల్యేగా ఎన్నికల బరిలోకి ఆలీ - నియోజకవర్గం ఫిక్స్..!!
సీఎం జగన్ ఎన్నికల వేళ అనూహ్య నిర్ణయాలు తీసుకుంటున్నారు. జగన్ చేస్తున్న వైసీపీ అభ్యర్దుల ఎంపిక కసరత్తు తుది దశకు చేరింది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేల స్థానాలు మార్చిన జగన్ హోరా హోరీ పోటీ ఉన్న నియోజకవర్గాల పైన ప్రత్యేకంగా ఫోకస్ చేసారు. అందులో భాగంగా ఇప్పుడు సినీ నటుడు ఆలీకి పోటీ చేసే స్థానం పైన ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఆలీని ఎంపీగా కాకుండా ఎమ్మెల్యేగా బరిలోకి దింపటం ఖాయంగా కనిపిస్తోంది.
అసెంబ్లీ బరిలో ఆలీ : సినీ నటుడు ఆలీ వైసీపీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ఆలీ ఈ సారి ఎన్నికల్లో పోటీకి ఆసక్తిగా ఉన్నారు. ఆలీని నంద్యాల ఎంపీగా పోటీ చేయించే అవకాశం ఉందని ప్రచారం సాగింది. అయితే, ప్రత్యర్ది పార్టీల వ్యూహాలు..అభ్యర్దుల ఖరారు వేళ జగన్ తన ఆలోచన మార్చుకున్నారు. ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో పట్టు నిరూపించుకోవటం జగన్ కు ప్రతిష్ఠాత్మకంగా మారుతోంది. జిల్లాలో ముగ్గురు ఎమ్మెల్యేలు టీడీపీ లో చేరటం..మరో ఎమ్మెల్యే జనసేనకు దగ్గర కావటంతో పాటుగా తాజాగా జిల్లా అధ్యక్షుడిగా ఉన్న రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్టీకి రాజీనామా చేసారు.

నియోజకవర్గం పై కసరత్తు : దీంతో, నెల్లూరు జిల్లాలో ఎంపీతో సహా తాజాగా ఖరారు చేసిన అభ్యర్దుల విషయంలోనూ జగన్ పునరాలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.నెల్లూరు సిటీ నుంచి కొద్ది రోజుల క్రితం డిప్యూటీ మేయర్ ఖలీల్ ను వైసీపీ సమన్వయకర్తగా నియమించింది. అదే సమయంలో నెల్లూరు ఎంపీ అభ్యర్దిత్వం పైన జగన్ కసరత్తు చేస్తున్నారు. ఇందు కోసం ప్రస్తుత ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డితో పాటుగా దేవిరెడ్డి సుధాకర్ రెడ్డి, బొమ్మిరెడ్డి, మేకపాటి విక్రమ్ పేర్లు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో టీడీపీ నుంచి నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అభ్యర్దిగా మాజీ మంత్రి నారాయణ పోటీ చేస్తున్నారు. అక్కడ ఖలీల్ స్థానంలో ఆలీని దింపే అంశం పైన చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.

జగన్ నిర్ణయం ఏంటి : ఇక్కడ ఖలీల్ ను కొనసాగిస్తే నెల్లూరు సిటీ నుంచి ఆలీని దింపే ఆలోచన పైన చర్చలు సాగుతున్నట్లు తెలుస్తోంది. నెల్లూరు ఎంపీ అభ్యర్దిని ఖరారు చేసే సమయంలో పార్లమెంట్ పరిధిలో అభ్యర్దుల మార్పులు అవసరమా కాదా..ఎవరిని ఎక్కడ పోటీ చేయించాలనే అంశం పైన తుది నిర్ణయం తీసుకుంటారని పార్టీ నేతలు చెబుతున్నారు. అదే సమయంలో కర్నూలు ఎమ్మల్యే హఫీజ్ ఖాన్ మార్పు పైన చర్చ నడుస్తోంది. నెల్లూరు సిటీ , కర్నూలు అసెంబ్లీ సీటులో సిట్టింగ్ మార్పు ఖాయమైతే అక్కడ నుంచి ఆలీని పోటీ చేయించే ఆలోచనలో సీఎం జగన్ ఉన్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. ఒకటి రెండు రోజుల్లోనే అభ్యర్ది కసరత్తు పూర్తి చేసే అవకాశం ఉందని సమాచారం.












Click it and Unblock the Notifications