జగన్ కు 'కోడి కత్తి' సవాల్ ! క్షమిస్తారా ? ప్రతీకారం కొనసాగిస్తారా ? ఎన్ఓసీ పంచాయతీ దారెటు ?

ఏపీలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో విశాఖ ఎయిర్ పోర్టులో వైఎస్ జగన్ పై జరిగిన కోడికత్తి దాడి ఎవరూ మర్చిపోలేరు. విశాఖ ఎయిర్ పోర్టులో ఎంటరవుతున్న జగన్ పై కోడికత్తితో శ్రీను చేసిన దాడి ఎంత సంచలనం రేపిందో దాని వెనుక ఎవరున్నారనే విషయం కూడా అంతే ఉత్కంఠ రేపింది. ఇప్పటివరకూ దీని వెనుక ఎవరున్నారో ఎన్ఐఏ కూడా తేల్చలేకపోయింది. దీంతో నాలుగేళ్లుగా జైల్లో మగ్గుతున్న శ్రీనును విడిపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిరభ్యంతర పత్రం ఇవ్వాలని కుటుంబ సభ్యులు సీఎం జగన్ ను కోరారు. దీనిపై జగన్ తీసుకోబోయే నిర్ణయం ఉత్కంఠ రేపుతోంది.

కోడికత్తి శ్రీను దుస్ధితి

కోడికత్తి శ్రీను దుస్ధితి

ఎందుకు దాడి చేశాడో తెలియదు, ఎవరు చెబితే చేశాడో తెలియదు, పైకి చెప్పేది వేరు, లోపల జరిగింది వేరు. వైజాగ్ ఎయిర్ పోర్టులో కోడికాళ్లకు పందాల్లో కట్టే కత్తితో వైఎస్ జగన్ పై అనూహ్యంగా దాడి చేసినంత సులువుగా ఈ కేసు నుంచి జనిపల్లి శ్రీను బయటపడలేకపోయాడు. దీంతో నాలుగేళ్లుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే మగ్గుతున్నాడు. అటు శ్రీను సంపాదిస్తే కానీ పూటగడవని కుటుంబం, వయసు మీద పడుతున్న తల్లి.. జైల్లోనుంచి ఎప్పుడు బయటపడతాడో తెలియని పరిస్ధితి. అయినా ఏదో ఆశ. దీంతో శ్రీను కుటుంబం నిన్న సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చి స్పందనలో తమ కుమారుడిని విడిపించాలని సీఎం జగన్ ను వేడుకునేలా చేసింది.

చేతులెత్తేసిన ఎన్ఐఏ

వైజాగ్ ఎయిర్ పోర్టులో జగన్ పై దాడి ఘటన జరిగి ఐదేళ్లు కావస్తున్నా ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ఎన్ఐఏ అడుగులు మాత్రం ముందుకు పడటం లేదు. కేంద్రం ఆదేశాలతో దేశంలో ఎక్కడెక్కడో జరుగుతున్న చిన్నా చితకా ఘటనలకు రంగంలోకి దిగి నానా హంగామా చేస్తోందని విమర్శలు ఎదుర్కొంటున్న ఎన్ఐఏ ఇప్పుడు ఓ రాష్ట్ర విపక్ష నేత, ఆ తర్వాత ముఖ్యమంత్రి కూడా అయిన వ్యక్తిపై జరిగిన దాడి నిందితుడిని విచారించి, వాస్తవాలు బయటపెట్టడంలో మాత్రం దారుణంగా విఫలమైంది. కేంద్రంతో సీఎం జగన్ నెరుపుతున్న సంబంధాలే దీని వెనుక ఉన్నాయనే ప్రచారం కూడా ఉంది. అయితే ఓ కేంద్ర దర్యాప్తు సంస్ధగా ఇంత దారుణ వైఫల్యానికి ఎన్ఐఏ రేపు కోర్టుకైనా ఏం సమాధానం చెబుతుందో చూడాలి.

జగన్ సర్కార్ ఎన్ఓసీ ఇస్తే ?

జగన్ సర్కార్ ఎన్ఓసీ ఇస్తే ?

ఇప్పుడు ఎన్ఐఏను కోడికత్తి శ్రీను కుటుంబ సభ్యులు సంప్రదిస్తే ఈ దాడికి బాధితుడిగా మారిన అప్పటి విపక్ష నేత, ప్రస్తుత సీఎం వైఎస్ జగన్ క్షమాభిక్ష ప్రకటిస్తే, శ్రీను విడుదలకు అభ్యంతరాలకు చెప్పకపోతే బెయిల్ ఇప్పించేందుకు తమకు అభ్యంతరం లేదని ఎన్ఐఏ చెబుతున్నట్లు తెలుస్తోంది. దీంతో శ్రీను కుటుంబ సభ్యులు ఇప్పుడు సీఎం జగన్ ను స్పందనలో ఫిర్యాదు రూపంలో ఆశ్రయించారు. గతంలో తమ కుమారుడి దాడితో రాజకీయంగా లబ్దిపొందిన జగన్ ఇప్పుడు జైల్లో మగ్గుతున్న వాడిని విడిపించాలని కోరుతున్నారు. మరి దీనికి రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకుంటుందా లేదా అన్నది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది.

 జగన్ కు కోడికత్తి సవాల్ ?

జగన్ కు కోడికత్తి సవాల్ ?

అయితే ఇదంత సులువైన వ్యవహారం కాదు. ఇప్పటికే నాలుగేళ్లుగా జైల్లో మగ్గుతున్న శ్రీను విడిపించాలంటే రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆయన విడుదలకు నిరభ్యంతర పత్రం ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ప్రభుత్వం అందుకు మొగ్గుచూపుతుందా లేదా అన్నది తేలాల్సి ఉంది. వైఎస్ జగన్ ఇప్పుడు జనిపల్లి శ్రీను విడుదలకు నిరభ్యంతర పత్రం ఇస్తే విపక్షాలు విమర్శలు ఎక్కుపెట్టే అవకాశముంది. రాజకీయంగా తన అవసరం తీరిపోయింది కాబట్టి ఎన్ఓసీ ఇచ్చి విడిపించారనే విమర్శలు వస్తాయి. అలాగని శ్రీను వ్యవహారాన్ని రాజకీయ కోణంలో చూసి ప్రభుత్వం పట్టించుకోకపోతే దానిపైనా విమర్శలు తప్పవు. గతంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హంతకుల్ని సైతం సోనియా కుటుంబం క్షమించినప్పుడు జగన్ మాత్రం శ్రీను విషయంలో ప్రతీకారధోరణితో వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఖాయం. కాబట్టి ఇప్పుడు జగన్ ఏ నిర్ణయం తీసుకోబోతున్నారనే విషయం ఉత్కంఠ రేపుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+