కొలికపూడి పై చంద్రబాబు సీరియస్ - కీలక నిర్ణయం..!!
ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వరుస వివాదాల పై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఈ వివాదాల పై నివేదిక కోరారు. సొంత పార్టీ నేతల నుంచే ఫిర్యాదులు రావటంతో చర్యలకు సిద్దం అయ్యారు. అందులో భాగంగా పార్టీ క్రమశిక్షణా కమిటీ ఎదుట హాజరు కావాలని కొలికపూడికి తాజా గా ఆదేశాలు అందాయి. వరుస ఘటనల పైన వివరణ కోరనున్నారు. కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా కొలికపూడి పైన చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది.
కొలికపూడి తీరుతో
తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస రావు పై గెలిచిన సమయం నుంచే ఫిర్యాదులు ఉన్నాయి. ఆయన వ్యవహార శైలి పైన సొంత పార్టీ నేతలే ఫిర్యాదు చేసారు. దూకుడు స్వభావం .. వివాదాలు సమస్యగా మారాయి. కాగా, ఎన్టీఆర్ జిల్లా ఎ.కొండూరు మండలం గోపాలపురం గ్రామం లో రెండు కుటుంబాల నడుమ నెలకొన్న ఆస్తి తగాదాలో తలదూర్చిన ఎమ్మెల్యే... ఎస్టీ దంపతుల పై దాడి చేశారు. తీవ్ర మనస్థాపానికి గురైన భార్య ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గ్రామానికి చెందిన భూక్యా రాం బాబు, భూక్యా కృష్ణ అన్నదమ్ముల బిడ్డలు. వీరిలో భూక్యా రాంబాబు టీడీపీ నాయకుడు కాగా భూక్యా కృష్ణ వైసీపీ నేత. కృష్ణ భార్య చంటి పంచాయతీలో 5వ వార్డు సభ్యురాలు. ఈ రెండు కుటుంబాల నడుమ చాలాకాలంగా భూ వివాదం నడుస్తోంది.

వివాదాలకు కేరాఫ్
తాజాగా కృష్ణకు చెందిన ప్రైవేటు భూమిలో రాంబాబు సీసీ రోడ్డు వేశారు. దీన్ని ప్రశ్నిస్తూ కృష్ణ రోడ్డుకు అడ్డంగా కంచె వేశారు. ఈ వివాదం ఎమ్మెల్యే కొలికపూడి దృష్టికి వెళ్లడంతో ఆయన శనివారం సాయంత్రం గ్రామానికి వచ్చారు. రాంబాబు ఎమ్మెల్యే అనుచరుడు. గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే సీసీ రోడ్డును పరిశీలించి అనంతరం భూక్యా కృష్ణ, చంటి దంపతులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిని దూషిస్తూ ఎమ్మెల్యే, ఆయన అనుచరులు దంపతులపై దాడి చేసి గాయపరిచారు. ఆ సమయంలో పోలీసులు కూడా అక్కడే ఉన్నారు. ఈ ఘటనతో మనస్థాపానికి గురైన చంటి పురుగుల మందు తాగి ఆత్యహత్యాయత్నానికి పాల్పడ్డారు.
చంద్రబాబు సీరియస్
పోలీసుల సమక్షంలోనే దాడి జరగడంపట్ల ఆగ్రహంతో ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా స్థానికులు నినా దాలు చేశారు. వివాదం సీఎం చంద్రబాబు దృష్టికి వెళ్లడంతో ఆయన ఎమ్మెల్యే నుంచి వివరణ తీసుకోవాలని పార్టీ నేతలను ఆదేశించారు. ఈ వివాదంతో పాటుగా వరుసగా వస్తున్న ఫిర్యాదుల వేళ చర్యలు తప్పవనే అభిప్రాయానికి పార్టీ నాయకత్వం వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో, ముందు గా పార్టీ క్రమశిక్షణా కమిటీ ఎదుట హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. సోమవారం కొలికపూడి క్రమిశిక్షణా కమిటీ ముందు హాజరు అయి తన వివరణ ఇవ్వనున్నారు. దీనిని పరిశీలించి కమిటీ చేసే సిఫార్సులకు అనుగుణంగా కొలికపూడి పైన చర్యలు ఉండే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications