రైతుభరోసాపై సీఎం చంద్రబాబు ఆదేశాలు - రైతుల ఖాతాల్లో నిధులు..!!
అన్నదాత సుభీభవగా మార్చిన రైతుభరోసా పథకం పై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు ఇచ్చారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పథకం అమల్లో భాగంగా మార్గదర్శకాలు సిద్దం చేయాలని అధికారులకు నిర్దేశించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంటలు నష్టపోయిన రైతులకు పెట్టుబడి రాయితీ ఇవ్వాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు. ఇందుకోసం రూ.36 కోట్లు విడుదల చేయాలని ఆర్థిక శాఖకు సూచించారు. రాష్ట్రంలో విత్తన కొరత ఉండొద్దని స్పష్టం చేశారు.
అధికారులకు నిర్దేశం
అన్నదాత సుఖీభవ పైన ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులతో సమీక్షించారు. ఎన్నికల సమయంలో రైతులకు ప్రతీ ఏటా రూ 20 వేల చొప్పున అర్దిక సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు ఈ పథకం అమలు దిశగా మార్గదర్శకాల తయారీకి చంద్రబాబు సూచనలు చేసారు. లబ్ధిదారులను గుర్తించేందుకు రైతుల మొబైల్ నంబర్లను - బ్యాంకు ఖాతాలతో లింక్ చేయాలని చంద్రబాబు ఆదేశించారు. వీటికి జియో ట్యాగ్ చేయాలని సూచించారు. మరోవైపు మైక్రో ఇరిగేషన్ మాన్యుఫాక్చరింగ్ పార్కు ఏర్పాటుపై ప్రతిపాదనలు తయారు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.

రైతులకు సాయంగా
వ్యవసాయ సమీక్షలో భాగంగా ఇటీవల కురిసిన భారీ వర్షాలకు జరిగిన పంట నష్టం పైన చర్చ జరిగింది. నష్టపోయిన రైతులకు పెట్టుబడి రాయితీ ఇవ్వాలని ముఖ్యమంత్రి స్పష్టం చేసారు. ఇందు కోసం విపత్తుల సహాయ నిధి నుంచి రూ 36కోట్లు విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో విత్తన కొరత ఉండొద్దని స్పష్టం చేశారు. వ్యవసాయంలో డ్రోన్ల వినియోగం పెంచాలని అధికారులకు సూచించారు. కరవు ప్రాంతాల్లో శాటిలైట్ ఫోటోల ద్వారా మాయిశ్చర్‌ను పరిశీలన చేసి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
కీలక సూచనలు
ఏపీలో సాగులో ఉన్న ప్రాంతాన్ని ఈ క్రాపింగ్ చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ప్రోత్సహించాలని.. ఉత్పత్తులను ఎగుమతించేందుకు ఎయిర్ కార్గో సేవలను అందించేలా చూడాలని అధికారులకు చంద్రబాబు స్పష్టం చేశారు. కొత్త జిల్లాల్లో డీసీసీబీలు ఏర్పాటు చేయాల్సి ఉందని సహాకార శాఖ అధికారులు సూచించారు. ఫుడ్ ప్రొసెసింగ్ లో ఉత్తమ విధానాన్ని తెచ్చేందుకు నివేదిక సిద్దం చేయాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు. ఉద్యాన పంటల్లో రాష్ట్రం ముందుండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.












Click it and Unblock the Notifications