నామినేటెడ్ పోస్టుల జాబితా సిద్దం - ఎవరికి ఏ పదవి..!!
ఏపీ రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. 2024 ఎన్నికల సమయంలో పలువురు సీనియర్లు కూటమి కోసం ఎమ్మెల్యే సీట్లు త్యాగం చేసారు. వారిలో పలువురికి ఎమ్మెల్సీ సీట్లు.. మరి కొందరికి నామినేటెడ్ పదవుల పైన హామీ ఇచ్చారు. మూడు పార్టీల నుంచి పదవులు ఆశిస్తున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. ఇప్పటి వరకు రెండు విడతలుగా నామినేటెడ్ పదవులను ప్రకటించారు. కాగా, మూడో విడత జాబితా సిద్దమైంది. మూడు పార్టీల నేతలకు ఇందులో అవకాశం దక్కనుంది. ఇక, ఈ లిస్టులో భారీగా పోస్టుల ఖరారు చేసినట్లు సమాచారం.
మూడో జాబితాలో
కూటమి ప్రభుత్వం మూడో విడత నామినేటెడ్ పదవుల జాబితా ఉగాది నాడు విడుదల చేసేందు కు సిద్దం అవుతోంది. ఈ మేరకు కసరత్తు తుది దశకు చేరింది. దాదాపు 60 వ్యవసాయ మార్కెట్ కమిటీ లతో పాటుగా మరో 60 కీలక కార్పోరేషన్లు .. 21 ఆలయ పాలకవర్గాలకు నియామకాలు పూర్తి చేయనున్నారు. మహానాడు నాటికి పదవుల ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయించారు. టీడీపీ నుంచి పదవులు ఆశిస్తున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది. జనసేన, బీజేపీ నుంచి పదవులు ఆశిస్తున్న వారి లిస్టులు సీఎం చంద్రబాబుకు చేరాయి. ఇప్పటికే నామినేటెడ్ పోస్టుల భర్తీ పైన పవన్, పురందేశ్వరి తో చంద్రబాబు చర్చించారు. ఈ నెల 30న మూడో జాబితా విడుదల దిశగా రంగం సిద్దం చేస్తున్నారు.
తుది కసరత్తు
నామినేటెడ్ పోస్టుల కోసం దాదాపు 60 వేల దరఖాస్తులు వచ్చాయి. అయితే, కేవలం వ్యవసాయ మార్కెట్ కమిటీలనే ఈ జాబితాలో ఖరారు చేస్తారా.. కార్పోరేషన్ ఛైర్మన్లను ప్రకటిస్తారా అనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. గత ఏడాది సెప్టెంబరులో నామినేటెడ్ పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టింది. 20 కార్పొరేషన్ల చైర్మన్లతోపాటు మొత్తం 99 మందితో తొలి జాబితాను అప్పట్లో విడుదల చేశారు. రెండో విడత భర్తీ ప్రక్రియ నవంబరులో జరిగింది. 59 మందితో రెండో జాబితా విడుదలైంది. తొలి, రెండో విడతల్లో సుమారు 150 మంది నేతలకు పదవులు ఖరారు చేసారు. ఇక..మూడో విడత నామినేటెడ్ పోస్టుల భర్తీపై నాలుగు నెలలుగా కసరత్తు జరుగుతున్నా సామాజిక సమీకరణలు.. కూటమి పార్టీల డిమాండ్లతో ప్రక్రియ ఆలస్యం అవుతోంది.

లిస్టులో ఉన్నదెవరు
టీడీపీ నుంచి పోస్టులు ఆశిస్తున్న వారిలో మాజీ ఎమ్మెల్యేలు ప్రభాకర్ చౌదరి, గన్ని వీరాంజనే యులు, పరసా రత్నం, దారపనేని నరేంద్ర, కనపర్తి శ్రీనివాసరావు, నాదెండ్ల బ్రహ్మం, గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్ వంటి వారు ఉన్నారు. వీరిలో ప్రభాకర్ చౌదరి, గన్ని వీరాంజనేయులు సీట్ల సర్దుబాటులో టికెట్లు కోల్పోయారు. అదే విధంగా జనసేన నుంచి పలువురు పదవులు కోరుతూ తమ పార్టీ అధినేతను కలిసారు. బీజేపీ నుంచి ఇప్పటికే జాబితాను సీఎం చంద్రబాబుకు ఇవ్వటం తో ఈ రెండు పార్టీలకు ఎన్ని పదవులు ఇవ్వాలనే అంశం పైన తుది చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే చంద్రబాబు ప్రతీ సారి కార్యకర్తల సమావేశంలో.. రెండో విడత పోస్టుల భర్తీ ఉంటుంద ని .. అందరికీ అవకాశం కల్పిస్తామని చెబుతూ వస్తున్నారు. దీంతో, మూడో విడతలో అవకాశం ఎవరికి దక్కుతుందనేది కూటమిలో ఆసక్తిగా మారుతోంది.












Click it and Unblock the Notifications