హైదరాబాద్ తెలంగాణాది మాత్రమే కాదంటూ సీఎం చంద్రబాబు సంచలనం!
ఏపీ సీఎం చంద్రబాబు దావోస్ పర్యటనను విజయవంతంగా పూర్తి చేసుకొని తిరిగి ఏపీకి వచ్చారు. దావోస్ కు వెళ్లి వచ్చిన తర్వాత అక్కడి అంశాలను ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని భావించిన చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ధ్వంసమైన ఏపీ బ్రాండ్ ను మళ్లీ ప్రమోట్ చేస్తున్నానని చంద్రబాబు తెలిపారు. ఇక ఇదే సమయంలో హైదరాబాద్ గురించి చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్ పై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్ ఒక్క తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే కాదని తెలుగు ప్రజలందరిదీ అని ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. దావోస్ పర్యటనపై మాట్లాడిన ఆయన హైదరాబాద్ అభివృద్ధిని గుర్తు చేసుకున్నారు. హైదరాబాద్ తెలుగు ప్రజలందరిదని ,ఏ ఒక్కరిదో అనుకుంటే పొరపాటేనని చంద్రబాబు పేర్కొన్నారు. హైదరాబాద్ అభివృద్ధిని చూసి తాను గర్వపడుతున్నానని తెలిపారు. తన హయంలో హైదరాబాద్ లో సంపద సృష్టించినట్టు చంద్రబాబు వెల్లడించారు.

తెలుగు రాష్ట్రాల అభివృద్ధి దేశ అభివృద్ధి
ఒకసారి సంపద సృష్టి జరిగిన తర్వాత దానిని ధ్వంసం చేయాలని ఎవరు అనుకోరని చంద్రబాబు తెలిపారు. తెలుగు రాష్ట్రాల అభివృద్ధి దేశ అభివృద్ధి అని పేర్కొన్న చంద్రబాబు దావోస్ పర్యటన విశేషాలను చెబుతూ హైదరాబాద్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. దావోస్ లో మొత్తం 27 సమావేశాలలో పాల్గొన్నానని చెప్పిన చంద్రబాబు గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్ మ్యానుఫ్యాక్చరింగ్ అనే అంశం పైన సదస్సు జరిగిందన్నారు.
ప్రపంచానికి సేవలు అందించే స్థాయికి ఏపీ
ఏపీ పెట్రో కెమికల్ హబ్, బ్లూ వర్షన్ ఎకానమీ అనే అంశాల గురించి విస్తృతంగా చర్చించామని తెలిపారు. ఇక లోకేష్ 35 సమావేశాలు, ఐదు రౌండ్ టేబుల్ సమావేశాలకు హాజరయ్యారని చంద్రబాబు వెల్లడించారు. కడప స్టీల్ ప్లాంట్ గురించి జిందాల్ సంస్థతో చర్చలు జరుపుతున్నామని చంద్రబాబు స్పష్టం చేశారు. వచ్చే కాలానికి ప్రపంచానికి అన్ని సేవలు ఇవ్వగలిగే స్థాయికి ఏపీ వస్తుందని ఊహిస్తున్నానని చంద్రబాబు అన్నారు.
విశాఖలో ఐటీ గేమ్ చేంజర్
ఇక విశాఖలో ఐటి ఒక గేమ్ చేంజర్ గా మారబోతుందని చంద్రబాబు అన్నారు. టి సి ఎస్ కూడా అక్కడ ఒక యూనిట్ ఏర్పాటు చేస్తుందని చంద్రబాబు తెలిపారు. ఇక ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించి అనేక అంశాలను వెల్లడించిన చంద్రబాబు హైదరాబాద్ విషయంలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలోనూ చర్చనీయాంశంగా మారాయి.












Click it and Unblock the Notifications