ఇక ఢిల్లీకి చంద్రబాబు: కేంద్రంతో తాడో పేడో తేల్చుకోవడానికి రెడీ..
అమరావతి: మంగళవారం నాడు నిర్వహించిన అఖిలపక్ష భేటీకి సంబంధించిన వివరాలను సీఎం చంద్రబాబు నేడు వెల్లడించనున్నారు. భేటీ అనంతరమే వివరాలు వెల్లడించాలని భావించినప్పటికీ.. అసెంబ్లీలోనే ఆ వివరాలు వెల్లడిస్తే బాగుంటుందని చంద్రబాబు భావించినట్టు తెలుస్తోంది.
అఖిలపక్ష నిర్ణయాలతో పాటు ప్రధాన రాజకీయ పార్టీలు భేటీకి దూరంగా ఉండటాన్ని ఆయన ఎండగట్టే అవకాశం ఉందంటున్నారు. అలాగే.. నాలుగేళ్లకు కానీ అఖిలపక్ష సమావేశం నిర్వహించాలన్న విషయం గుర్తుకు రాలేదా? అన్న ప్రశ్నకు కూడా ఆయన సమాధానం చెబుతారని అంటున్నారు.

అఖిలపక్ష సమావేశంలో భాగంగా.. జాతీయ స్థాయి నేతలతో సంప్రదింపులు జరపాలని చంద్రబాబు నిర్ణయించినట్టు సమాచారం. ఈ మేరకు ఏప్రిల్ 2,3 తేదీల్లో ఆయన ఢిల్లీ వెళ్లనున్నారని లీకులు వస్తున్నాయి. కేంద్రంతో ఇక తాడో పేడో తేల్చుకునేందుకే ఆయన హస్తిన బాట పడుతున్నారని అంటున్నారు.
ఎలాగైనా హోదా సాధించి తీరుతాం: మంత్రి జవహర్
ఇక అఖిలపక్ష సమావేశానికి జనసేన, వైసీపీ, వామపక్షాలు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన మంత్రి జవహర్.. ఆ మూడు పార్టీలు రాకపోవడమే మంచిదని అన్నారు. తద్వారా వారి ఉద్దేశమేంటనేది బయటపడిందన్నారు.
హోదాపై పోరాడుతున్న క్రెడిట్ ఎక్కడ చంద్రబాబుకు దక్కుతుందోనన్న అక్కసుతోనే ఆ పార్టీలు అఖిలపక్ష భేటీకి రాలేదన్నారు. ఇక వైసీపీ నేతలు ఢిల్లీలోనేమో కాళ్లు మొక్కుతున్నారని.. ఇక్కడ మాత్రం కాళ్లు తొక్కుతున్నారని ఎద్దేవా చేశారు.
నాలుగేళ్ల తర్వాత అఖిలపక్షం గుర్తొచ్చిందా? అన్న విమర్శలను ఆయన కొట్టిపారేశారు. నాలుగేళ్లు వేచి చూడటానికి, నాలుగేళ్ల తర్వాత అఖిలపక్ష సమావేశం నిర్వహించడానికి తేడా ఉందన్నారు.
ఎలాగైనా హోదా సాధిస్తామని అనుకున్నామని, కానీ తమ ఆశల మీద కేంద్రం నీళ్లు జల్లిందని ఆరోపించారు. అందరిని కలుపుకుపోవడానికి తాము సిద్దంగా ఉన్నామని, అందరం కలిసి పోరాడితే హోదా వస్తుందని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications