ఏం జరుగుతోంది?: ధీమాగా చంద్రబాబు, అమరావతికి ఉద్యోగులు వెళ్తారా?
అమరావతి: నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతిలో ఉద్యోగులు ఇబ్బందులు పడకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెలగపూడిలో నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయ నిర్మాణ పనులను సోమవారం ఆయన పరిశీలించారు.
తాత్కాలిక సచివాలయంలో గోడల నిర్మాణం, విద్యుత్, ఇతర సౌకర్యాలపై ఆయన అధికారులతో సమీక్షించారు. తాత్కాలిక సచివాలయానికి నిర్మితమవుతున్న వెలగపూడి గ్రామానికి వచ్చే రహదారుల అభివృద్ధి పైనా ఆయన చర్చించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తాత్కాలిక సచివాలయ పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు.

జూన్ 27లోగా సచివాలయ కార్యకలాపాలు ఇక్కడి నుంచే జరుగుతాయని స్పష్టం చేశారు. నిర్మాణం పూర్తైన తర్వాత ఇక్కడి భవనంలోకి ఏయే విభాగాలు తరలించాలో నిర్ణయించి... వారికి ముందస్తు సమాచారం ఇస్తామన్నారు. అనంతరం మిగిలిన విభాగాలకు చెందిన ఉద్యోగులను దశల వారీగా ఇక్కడికి తరలిస్తామన్నారు.
దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. దీంతో పాటు అమరావతికి వచ్చే ఉద్యోగులకు వసతి సౌకర్యం కలిగించేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్ర పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఉద్యోగులు ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. ఇక, అమరావతి ప్రాంతంలో పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు.

ఇందుకోసం రాజధాని పరిధిలోని 29 గ్రామాల్లో పరిశుభ్రతపై తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు సూచన చేశారు. 10 ఏళ్ల పాటు హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా నిర్ణయించినా, రాష్ట్రంలోని ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఇక్కడ నుంచి పరిపాలన చేస్తున్నట్టు చెప్పారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు సమాన దూరంలో ఉండాలనే ఉద్దేశ్యంతో అమరావతిని ప్రాంతాన్ని రాజధానిగా ఎంచుకున్నట్లు ఆయన తెలిపారు.
ఉద్యోగులకు వసతులు లేవని దుష్ప్రచారం: అశోక్ బాబు
అమరావతికి రావడం ఇష్టంలేని కొందరు ఉద్యోగులు అక్కడ వసతులు లేవని దుష్ప్రచారం చేస్తున్నారని ఏపీ ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగుల డిమాండ్లలో చాలా వరకు ప్రభుత్వం పరిష్కరించిందని, 35 శాతం హెచ్‌ఆర్‌ఏ, 5 రోజుల పనిదినాలపై జీవో కూడా జారీ చేసిందని గుర్తు చేశారు.
ప్రభుత్వం ఆర్థిక లోటులో ఉన్నప్పటికీ ఉద్యోగులకు 43శాతం ఫిట్‌మెంట్ ఇచ్చిందని, ఉద్యోగులంతా దీనిని గుర్తుంచుకుని రాష్ట్ర అభివృద్ధికి సహరించాలని ఆయన సూచించారు. ఆగస్టు 31 నాటికి అన్ని హెచ్‌వోడీలు విజయవాడకు తరలివస్తాయని ఆయన చెప్పారు.
వెలగపూడి తాత్కాలిక సచివాలయంలో అన్ని హెచ్‌వోడీలు ఉంటాయని గతంలో ప్రభుత్వం చెప్పిందని, అయితే కొన్ని కారణాల వల్ల విజయవాడ, గుంటూరులో ప్రైవేట్ భవనాలు సమకూర్చుకోవాలని ఇప్పుడు చెబుతోందని, దీంతో ఉద్యోగుల్లో కొంత అయోమయం ఏర్పడిందన్నారు.

కొంత మంది ఉద్యోగులకు అభ్యంతరాలున్నా, ఉద్యోగుల తరలింపుపై సీఎం చంద్రబాబుదే తుది నిర్ణయమని చెప్పారు. ఆయన ఎప్పుడూ ఆదేశించినా అమరావతికి వెళ్లడానికి తాము సిద్ధమంగా ఉన్నాయని అశోక్ బాబు చెప్పారు.
ఉద్యోగుల తరలింపులో సమస్యలు ఉన్న మాట వాస్తవమే: మురళీకృష్ణ
ఉద్యోగుల తరలింపులో సమస్యలు ఉన్న మాట వాస్తవమేనని ఏపీ ఉద్యోగ సంఘం నేత మురళీకృష్ణ అంగీకరించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అన్ని సౌకర్యాలు ప్రభుత్వం కల్పించాలంటే సాధ్యం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఉద్యోగులు కూడా కొంతమేరకు సర్దుకుపోవాలని మురళీ కృష్ణ సూచించారు. త్వరలోనే స్థానికత, 30 శాతం హెచ్‌ఆర్‌ఏపై జీవో విడుదల చేసే అవకాశముందని ఆయన స్పష్టం చేశారు.
రోడ్డు మ్యాప్ ప్రకటించకపోవడం వల్లే తరలింపులో గందరగోళం నెలకొని ఉందని చెప్పిన ఆయన ఈనెల 27 నుంచి వెలగపూడిలో పరిపాలన ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. తాత్కాలిక సచివాలయంలో భవన నిర్మాణాలను బట్టి ఉద్యోగుల తరలింపు ప్రక్రియ ఉంటుందని చెప్పారు. హైదరాబాద్ నుంచి పూర్తి స్థాయి ఉద్యోగుల తరలింపునకు మూడు నెలలు పడుతుందని పేర్కొన్నారు.
ఉద్యోగుల తరలింపులో రాజకీయ చేయడం తగదు: ఏపీ సచివాలయ గెజిటెడ్ అధికారుల సంఘం నేత కృష్ణయ్య
రాజధాని అమరావతి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని... ప్రభుత్వం రమ్మంటే జూన్ 15కే వచ్చేస్తామని ఏపీ సచివాలయ గెజిటెడ్ అధికారుల సంఘం నేత కృష్ణయ్య ప్రకటించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ 30 శాతం హెచ్‌ఆర్‌ఏ, రోడ్డు మ్యాప్ అడిగితే రాజకీయం చేయడం తగదని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇప్పటి వరకు తాము హైదరాబాద్‌లో ఉన్నామని... స్థానికత రాకపోతే ఉద్యోగుల పిల్లలు నష్టపోతారని, అందుకే ఈ విషయంలో గట్టిగా పట్టు పట్టాల్సి వచ్చిందని ఆయన చెప్పారు. అంతే తప్ప ఉద్యోగుల్లో ఎలాంటి విభేదాలు లేవని, తామంతా ఏకతాటిపైనే ఉన్నామని స్పష్టం చేశారు.
ఏమవుతుందో వేచి చూడాలి
తాత్కాలిక సచివాలయం పనులు చివరి దశకు వచ్చేశాయి. ఈ నెల 27 నుంచి నవ్యాంధ్ర నుంచే పరిపాలన కొనసాగుతుందని ఏపీ సీఎం చంద్రబాబు సైతం గట్టిగా చెబుతుండటంతో ఏపీ ఉద్యోగుల తరలింపు రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. అమరావతికి వెళ్లేందుకు కొంతమంది ఉద్యోగులు విముఖత వ్యక్తం చేస్తుంటే... మరికొంత మంది మాత్రం సుముఖత వ్యక్తం చేస్తున్నారు.
అమరావతికి ఉద్యోగులు వేళతారా? లేక చంద్రబాబుకు ఝలక్ ఇస్తారా తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.












Click it and Unblock the Notifications