సీఎం చంద్రబాబుతో పవన్ భేటీ.. రాజ్యసభ సీట్లు పై చర్చ!
ఏపీ రాజకీయాల్లో మరో కీలక అధ్యాయం మొదలవుతున్నట్టే కనిపిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ బుధవారం ఉదయం భేటీ అయ్యారు. తాజా భేటీ... రాచకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తిరుమల లడ్డూ వ్యవహారం నుంచి మొదలుకుని, కూటమి పార్టీల సమన్వయం, రానున్న రాజ్యసభ ఎన్నికల వరకూ కీలక అంశాలు ఈ సమావేశంలో ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం.
ప్రత్యేకంగా కూటమిలోని మూడు పార్టీలు - టీడీపీ, జనసేన, బీజేపీ - ఇకపై కలిసికట్టుగా కార్యక్రమాలు నిర్వహించేలా స్పష్టమైన ప్రణాళికలు రూపొందించాల్సిన అవస్యకతపై చంద్రబాబు, పవన్ ఒక రూట్ మ్యాప్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ పరిపాలనతో పాటు రాజకీయంగా కూడా కూటమిని మరింత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నదే ఈ భేటీ సారాంశంగా చెబుతున్నారు.

రాజ్యసభ సీట్ల పైనే అందరి చూపు..
ఇదే సమయంలో ఏపీ రాజకీయాలను ఉత్కంఠకు గురిచేస్తున్న మరో అంశం... రాజ్యసభ ఖాళీలు. ఈ ఏడాది ఏపీ నుంచి మొత్తం నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. వైసీపీకి చెందిన ముగ్గురు రాజ్యసభ సభ్యులు - అయోధ్య రామిరెడ్డి, పరిమళ్ నత్వాని, పిల్లి సుభాష్ చంద్రబోస్ - జూన్ నెలలో పదవీ విరమణ చేయనున్నారు. అదే సమయంలో టీడీపీ తరఫున రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సానా సతీష్ పదవీకాలం కూడా ముగియనుంది. దీంతో పెద్దల సభకు ఎవరు వెళ్లబోతున్నారు అన్న అంశం ఇప్పుడు రాజకీయ చర్చల కేంద్రబిందువుగా మారింది.
ప్రస్తుత శాసనసభ బలాబలాల ప్రకారం ఈ నాలుగు రాజ్యసభ సీట్లు కూడా కూటమి ఖాతాలోకే వెళ్లే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే అసలు ప్రశ్న... ఆ నాలుగు సీట్లను మూడు పార్టీలు ఎలా పంచుకుంటాయి? అన్నదే. ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగిన రెండు విడతల రాజ్యసభ ఉపఎన్నికల్లో టీడీపీ, బీజేపీ చెరో రెండు సీట్లు దక్కించుకున్నాయి. కానీ కీలక భాగస్వామి అయిన జనసేనకు ఇప్పటివరకు పెద్దల సభలో ప్రాతినిధ్యం లభించలేదు.
జనసేన నుంచి చిరంజీవి..?
ఈ నేపథ్యంలో ఈసారి జనసేనకు ఒక రాజ్యసభ సీటు ఖాయం అన్న ప్రచారం జోరుగా సాగుతోంది. జనసేన తరఫున లింగమనేని రమేష్ పేరు బలంగా వినిపిస్తుండగా, మరోవైపు మెగాస్టార్ చిరంజీవి పేరును కూడా పరిశీలనలోకి తీసుకున్నట్లు ఇన్‌సైడ్ టాక్. తన అన్నయ్యను రాజ్యసభకు పంపితే పార్టీకి, కూటమికి వచ్చే రాజకీయ లాభనష్టాలపై పవన్ కల్యాణ్ పార్టీ పెద్దలతో చర్చలు జరుపుతున్నారన్న మాట రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
టీడీపీకి తలనొప్పి..
టీడీపీలో పరిస్థితి మరింత క్లిష్టంగా ఉంది. గత ఎన్నికల్లో త్యాగాలు చేసిన నేతలు, సీనియర్ నాయకులు, పార్టీ కోసం కీలకంగా పనిచేసినవారంతా ఇప్పుడు రాజ్యసభ బెర్త్ కోసం ఎదురుచూస్తున్నారు. గల్లా జయదేవ్, దేవినేని ఉమా, పిఠాపురం వర్మ, జవహర్‌తో పాటు వర్ల రామయ్య, యనమల రామకృష్ణుడు, కంభంపాటి రామ్మోహన్‌రావు, టీడీ జనార్ధన్, కనకమేడల రవీంద్రకుమార్, రెడ్డప్పగారి శ్రీనివాస్ రెడ్డి వంటి పేర్లు ఈ రేసులో ప్రముఖంగా వినిపిస్తున్నాయి.
సామాజిక వర్గాల సమతుల్యం, సామాజిక సమీకరణలు, పార్టీ విధేయత... అన్నీ కలిపి టీడీపీకి సవాల్‌గా మారాయి. కమ్మ, రెడ్డి, ఎస్సీ, బీసీ వర్గాల నుంచి ఆశావహులు ఎక్కువగా ఉండటంతో ఎవరికీ న్యాయం చేయాలన్నది తలనొప్పిగా మారిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
వ్యూహాత్మకంగా అడుగులు..
అందుకే చంద్రబాబు ఒక వ్యూహాత్మక ప్లాన్‌తో ముందుకు వెళ్లనున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఎలాగైనా టీడీపీ ఖాతాలో రెండు రాజ్యసభ సీట్లు తీసుకుని, అందులో ఒకటిని సానా సతీష్‌కు రీన్యూవల్ చేయడం, మిగతా ఒక సీటును ఆశావహుల్లో ఎవరికైనా ఇవ్వడం... మిగిలిన వారిని శాసన మండలి రేసులో సర్దుబాటు చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం.
మొత్తానికి... సీఎం చంద్రబాబు.. డిప్యూటీ సీఎం పవన్ భేటీ తర్వాత ఏపీ రాజకీయాల్లో రాజ్యసభ రేసు మరింత రసవత్తరంగా మారింది. కూటమి సమీకరణలు, జనసేనకు దక్కే అవకాశం, టీడీపీలో ఎవరి అదృష్టం పండుతుందన్నది... వచ్చే కొన్ని నెలల్లో తేలిపోనుంది. రాజకీయ వర్గాలు మాత్రం ఇప్పుడు ఒక్కటే ప్రశ్న వేస్తున్నాయి - పెద్దల సభకు ఈసారి ఎవరి పేరు ఫిక్స్ అవుతుంది?












Click it and Unblock the Notifications