మహిళలకు సీఎం చంద్రబాబు అదిరిపోయే శుభవార్త!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు సీఎం చంద్రబాబు శుభవార్త చెప్పారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని చెప్పే ప్రయత్నం చేసింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు ఆర్థిక భరోసా కలిగించేలా నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలో ఈనెల 8వ తేదీ నుంచి మహిళలకు ఉపాధి కల్పించేలా కుట్టు శిక్షణ కేంద్రాలను ప్రారంభించనుంది.
టైలరింగ్ లో మహిళలకు శిక్షణ
టైలరింగ్ లో నిష్ణాతుల ఆధ్వర్యంలో 90 రోజులపాటు వారికి శిక్షణ ఇవ్వనుంది. ఇప్పటికే ఏపీలో చంద్రబాబు సర్కార్ మహిళలకు ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లను ఇస్తున్న విషయం తెలిసిందే. ఇక తాజాగా టైలరింగ్ లో కూడా శిక్షణ అందజేసి ఉచితంగా కుట్టు మిషన్లు ఇచ్చి మహిళల జీవనోపాధికి దోహదం చేయనుంది. సమాజాభివృద్ధిలో మహిళలకు కీలకమైన స్థానం ఉందని గుర్తించిన క్రమంలోనే చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా చెబుతున్నారు.

మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు
రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాలలో బీసీ, ఈడబ్ల్యూఎస్, కాపు సామాజిక వర్గానికి చెందిన 1,02,832 మంది మహిళలకు కుట్టుమిషన్లను అందజేయాలని సీఎం చంద్రబాబు నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం 255 కోట్ల రూపాయలను ప్రభుత్వం ఖర్చు చేయబోతోంది. బీసీ వెల్ఫేర్ కార్పొరేషన్ ద్వారా 46,044 మందికి, ఈడబ్లూఎస్ సామాజిక వర్గానికి చెందిన 45,772 మందికి, కాపు కార్పొరేషన్ ద్వారా 11,016 మందికి కుట్టు మిషన్లను ఇవ్వనుంది.
చివరిదశకు లబ్దిదారుల ఎంపిక
ఇప్పటికే లబ్ధిదారుల ఎంపిక కార్యక్రమం కూడా చివరి దశకు చేరుకుంది. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కేవలం టైలరింగ్ శిక్షణ మాత్రమే కాకుండా ఈవెంట్ మేనేజ్మెంట్ నిర్వహణ యూనిట్ల ఏర్పాటులోనూ మహిళలకు ప్రాధాన్యత ఇస్తున్నారు జనరిక్ మెడికల్ షాపులను ఏర్పాటు చేయడం డెయిరీ, గొర్రెల యూనిట్లను ఏర్పాటు చేయడంలోనూ మహిళా లబ్ధిదారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది.
సమాజాభివృద్ధిలో మహిళల పాత్రే కీలకం: మంత్రి సవిత
ఇక ఇదే విషయాన్ని ఏపీ మహిళా మంత్రి సవిత పేర్కొన్నారు. సమాజాభివృద్ధిలో మహిళల పాత్రే కీలకమని నమ్మిన వ్యక్తి చంద్రబాబు అని ఆమె అభిప్రాయ పడ్డారు. ఈ నెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా రాష్ట్ర వ్యాప్తంగా 1,02,832 మహిళలకు టైలరింగ్ శిక్షణ ఇచ్చి, కుట్టు మిషన్లు పంపిణీ చేయనున్నామన్నారు. మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సవిత కోరారు.












Click it and Unblock the Notifications