చంద్రబాబు నోట సంతృప్తిగా ఉందన్న మాట.. కారణమిదే!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుండి గత ప్రభుత్వ పాలన పై పదేపదే అసంతృప్తి వెళ్ళగక్కిన చంద్రబాబు తాజాగా తొలిసారి తనకు సంతృప్తి కలిగిందంటూ వ్యాఖ్యలు చేయడం ఆసక్తిగా మారింది. ఏపీలో పాలన పగ్గాలు చేపట్టిన నాటినుండి అన్ని శాఖల పనితీరుపైన, గత ప్రభుత్వ హయాంలో ఏపీలో అన్ని వ్యవస్థలు నాశనమయ్యాయన్న చంద్రబాబు తాజాగా తనకు సంతృప్తి కలిగిందని ఓ పోస్ట్ షేర్ చేశారు.
పెన్షన్ల పంపిణీ సంతృప్తినిచ్చిందన్న చంద్రబాబు
తొలిసారిగా ఏపీలో ప్రభుత్వ పథకం అమలు తీరు పైన ఎక్స్ వేదికగా సంతృప్తిని వ్యక్తం చేశారు. ఒకటవ తేదీన ఇంటి వద్ద 2737 కోట్లతో 64 లక్షల మందికి పెంచిన పెన్షన్ల పంపిణీ తనకు ఎంతో సంతృప్తినిచ్చిందని చంద్రబాబు పేర్కొన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక్కరోజులో రికార్డు స్థాయిలో 97.54% పింఛన్లు అందించామని, వృద్ధులు, వికలాంగులు, ఇతరుల లబ్ధిదారుల ఆర్థికభద్రత మా బాధ్యత అంటూ చంద్రబాబు ట్వీట్లో పేర్కొన్నారు.

ఉద్యోగుల జీతాలిచ్చామన్న చంద్రబాబు
పెరిగిన పించను ఆ పేదల జీవితాలకు భరోసా కల్పిస్తుంది అన్న చంద్రబాబు ఈ కార్యక్రమంలో భాగస్వాములైన ప్రభుత్వ ఉద్యోగులకు, అధికారులకు అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నామని వెల్లడించారు. ఇక ప్రభుత్వ ఉద్యోగులు అంటే ప్రభుత్వం లో భాగమని పేర్కొన్న చంద్రబాబు ప్రజలకు ఏ మంచి చేయాలన్న వారే కీలకమని అభిప్రాయం వ్యక్తం చేశారు. అలాంటి వర్గానికి కూడా ఒకటవ తేదీన జీతాలు అందజేశామని రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్లు చెల్లించామని పేర్కొన్నారు.
1వ తేదీనే ఇంటి వద్ద రూ. 2737 కోట్లతో 64 లక్షల మందికి పెంచిన పింఛన్ల పంపిణీ ఎంతో సంతృప్తినిచ్చింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక్క రోజులో రికార్డు స్థాయిలో 97.54 శాతం పింఛన్లు అందించాం. వృద్దులు, దివ్యాంగులు, ఇతర లబ్దిదారుల ఆర్థిక భద్రత మా బాధ్యత. పెరిగిన పింఛను ఆ పేదల జీవితాలకు… pic.twitter.com/sKSG0WqtPd
— N Chandrababu Naidu (@ncbn) August 2, 2024
ఉద్యోగులకు చంద్రబాబు పిలుపు
ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, అనేక సమస్యలు ఉన్నప్పటికీ 5300 కోట్లు విడుదల చేసి వారికి దక్కాల్సిన జీతం ఒకటవ తేదీనే చెల్లించామని చంద్రబాబు వెల్లడించారు. రాష్ట్ర పునర్నిర్మాణ కార్యక్రమంలో ఉద్యోగులు, అధికారుల పాత్ర ఎంతో కీలకమని ఉద్యోగులతో పని చేయించుకోవడం మాత్రమే కాదు వారి సంక్షేమం చూసే, గౌరవం ఇచ్చే ప్రభుత్వం కూటమి ప్రభుత్వమని చంద్రబాబు స్పష్టం చేశారు. కలిసి కష్టపడుదాం రాష్ట్ర భవిష్యత్తును మారుద్దామని చంద్రబాబు పిలుపునిచ్చారు.
తొలిసారి సంతృప్తిగా ఉందన్న చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి కొత్త ప్రభుత్వానికి టెన్షన్ పెంచినప్పటికీ ఆగస్టు నెలలో ఉద్యోగుల జీతాలు, పెన్షన్లను సకాలంలో అందించగలిగామని ఇది తనకు సంతృప్తినిచ్చిందని చంద్రబాబు వెల్లడించారు. ఇక అధికారం చేపట్టినప్పటినుంచి అనేక విషయాలలో అసంతృప్తి వెళ్ళగక్కుతున్న చంద్రబాబు తొలిసారి సంతృప్తి చెందానని మాట్లాడడం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ప్రజలు సంతృప్తి చెందేలా పాలన అందించాలని, ప్రతి నెల ఇదే విధంగా పెన్షన్ల పంపిణీ సాగించాలని లబ్ధిదారులు కోరుతున్నారు.












Click it and Unblock the Notifications