సీ షోర్ హైవేపై కేంద్రానికి ప్రతిపాదన పంపిన చంద్రబాబు.. ప్లాన్ ఇదే!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన నాటి నుండి కూటమి ప్రభుత్వం ఏపీని అన్ని విధాలుగా అభివృద్ధి పదం వైపు ముందుకు నడిపించడానికి శతవిధాల కృషి చేస్తోంది. ఏపీని పర్యాటకంగా అభివృద్ధి చేయడం మాత్రమే కాక, ప్రజలకు అవసరమయ్యే విధంగా పలు నిర్ణయాలను తీసుకుంటూ ముందుకు వెళుతుంది. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సముద్ర తీరం వెంట సి షోర్ హైవే నిర్మాణం కోసం ప్రణాళికలను రూపొందించింది.
సి షోర్ హైవేపై ప్రభుత్వ నిర్ణయం
కత్తిపూడి-ఒంగోలు నేషనల్ హైవే-216 విస్తరణకు ప్రత్యామ్నాయంగా ఈ ప్రతిపాదన తెరపైకి వచ్చింది. నరసాపురం నుంచి మచిలీపట్నం మీదుగా బాపట్ల వరకు 120కిలోమీటర్ల పొడవున ఈ సి షోర్ హైవే నిర్మించాలని ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వానికి చేరాయి. మచిలీపట్నం పోర్టు కోసం గతంలో నేషనల్ హైవే-216 విస్తరణను పరిశీలించారు. కానీ, భూసేకరణ, అధికవ్యయం అవుతున్న కారణంగా సీషోర్ హైవే ప్రత్యామ్నాయంగా తెరపైకి వచ్చింది.

మత్స్య, ఆక్వా ఉత్పత్తుల రవాణాకు సీషోర్ హైవే
ఇది తక్కువ ఖర్చుతో పూర్తవుతుందని అంచనా. మచిలీపట్నం ఎమ్మెల్యే కొల్లు రవీంద్ర దీనిని ప్రతిపాదించగా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీనిని ఆమోదించి కేంద్రానికి పంపారు. ఈ సీషోర్ హైవే మత్స్య, ఆక్వా ఉత్పత్తుల రవాణాకుమాత్రమే కాదు పర్యాటకులకు కూడా ఎంతో ప్రయోజనం చేకూరుస్తుంది. మచిలీపట్నం, నిజాంపట్నం పోర్టులను కలుపుతూ మత్స్య, వ్యవసాయం, కొబ్బరి రవాణాకు ఇది కీలకంగా ఉంటుంది.
భూసేకరణ లేకుండానే ఈ ప్రాజెక్టు
పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, బాపట్ల జిల్లాల మధ్య అనుసంధానాన్ని ఈ రహదారి మెరుగుపరుస్తుంది. నేషనల్ హైవే-216 రద్దీని ఈ రహదారి తగ్గిస్తుందని అంచనా వేస్తున్నారు. కాకినాడ నుంచి మచిలీపట్నం వరకు, ముఖ్యంగా ఉప్పాడ వంటి ప్రాంతాలకు దీంతో రవాణా వేగవంతం అవుతుంది. తీరప్రాంత నియంత్రణ నిబంధనలు రోడ్లకు ఆటంకం కావని అధికారులు స్పష్టం చేయడంతో, భూసేకరణ లేకుండానే ఈ ప్రాజెక్టును చేపట్టవచ్చని భావిస్తున్నారు.
పర్యాటక రంగానికి ఊతం
ఈ హైవే ఏపీకి ప్రత్యేకంగా నిలుస్తుంది. పర్యాటక రంగానికి ఎంతో ప్రోత్సాహం అందిస్తుంది. బీచ్‌లకు మెరుగైన అనుసంధానం లభించి, పర్యాటక కేంద్రాలు అభివృద్ధి చెందుతాయి. తద్వారా హోటళ్లు, రిసార్టులు వంటి వసతులు పెరుగుతాయి. కాలువలు సముద్రంలో కలిసే చోట ఆర్‌వోబీలు, ఫ్లైఓవర్లు నిర్మించాల్సి ఉంటుంది. ఈ వివరాలను కేంద్రానికి సమర్పించిన ప్రతిపాదనలలో పొందుపరిచారు.












Click it and Unblock the Notifications