AP Cabinet: కేబినెట్లో ఆ మంత్రులపై చంద్రబాబు సీరియస్..!
ఏపీలో ఇవాళ జరిగిన కేబినెట్ భేటీలో ప్రధాన అజెండాపై చర్చ జరిగింది. అనంతరం సీఎం చంద్రబాబు రాష్ట్రంలో తాజా పరిణామాలు, మంత్రుల పనితీరు, ఇతర అంశాలపై మాట్లాడారు. ఈ సందర్భంగా పలువురు మంత్రుల పనితీరుపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. వీరి పనితీరు వల్ల ప్రభుత్వంపై పడుతున్న ప్రభావాన్ని సైతం వారికి గుర్తుచేశారు. దీంతో చంద్రబాబు వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

ఇవాళ కేబినెట్ భేటీలో మంత్రుల శాఖల్లో ఫైళ్లు పెండింగ్ లో ఉండటంపై సీఎం చంద్రబాబు స్పందించారు. మంత్రులు టెక్నాలజీని సరిగ్గా వాడుకోకపోవడాన్ని కూడా చంద్రబాబు తప్పుబట్టారు. మంత్రి దగ్గరికి ఏదైనా ఫైలు వచ్చి ఎంత సేపు పెండింగ్‌లో ఉంటోందో తనకు తెలుసని చంద్రబాబు తెలిపారు. మంత్రుల పనితీరును తానే స్వయంగా పర్యవేక్షిస్తున్నట్లు సీఎం వారికి తెలిపారు. జిల్లాలకు వెళ్లని ఇన్ ఛార్జ్ మంత్రుల తీరుపైనా చంద్రబాబు సీరియస్ అయ్యారు.
రాష్ట్రంలో ప్రభుత్వం తీసుకొస్తున్న పాలసీల్ని మంత్రులు లోతుగా పరిశీలించకపోవడంపైనా చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరిలో కొంతమంది మంత్రులు అస్సలు వాటిపై అధ్యయనం చేయడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇకపైనా తన మంత్రుల పనితీరుపై తన పర్యవేక్షణ కొనసాగుతుందన్నారు. మరోవైపు ఇప్పటికే ఆరునెలల పాలనలో పలు కేబినెట్ సమావేశాల్లో మంత్రులు తమ శాఖలపై పట్టు సాధించాలని చంద్రబాబు సూచిస్తూనే ఉన్నారు. అయినా కొందరు మంత్రుల వైఖరిలో మార్పు రావడం లేదని చంద్రబాబు అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications