కాకినాడ, రాజమండ్రి ఆస్పత్రుల్లో డాక్టర్లపై చంద్రబాబు సీరియస్..! కీలక ఆదేశాలు..!
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇవాళ అనూహ్యంగా డాక్టర్లపై సీరియస్ అయ్యారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల్లోని కాకినాడ, రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న డాక్టర్లు, సిబ్బందిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడితో ఆగకుండా వారిపై చర్యలకు కూడా ఆదేశించారు. దీంతో ఈ వ్యవహారం రాష్టవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఈ రెండు ఆస్పత్రుల్లో డాక్టర్లు, సిబ్బందిపై సీఎం ఆగ్రహం వెనుక కారణమేంటో ఇప్పుడు చూద్దాం.
కాకినాడ, రాజమండ్రి ప్రభుత్వాసుపత్రుల్లో తాజాగా రెండు అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకున్నాయి. వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఈ రెండు వరుస సంఘటనలు చోటుచేసుకోవడంపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కాకినాడ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో జరిగిన ఘటనలో తాళ్లరేవు మండలం గడిమొగ గ్రామానికి చెందిన 8 నెలల గర్భిణి మల్లేశ్వరి ప్రాణాలు కోల్పోయారు.

మల్లేశ్వరికి పాంటాప్రోజోల్ అలెర్జీ ఉందని, హైపర్ టెన్షన్, డయాబెటిస్ కూడా ఉన్నాయని కేస్ షీట్లోనే నమోదు చేసినప్పటికీ, వాటిని పరిగణనలోకి తీసుకోకుండా నవంబర్ 20న మధ్యాహ్నం పీజీ విద్యార్థిని పాంటాప్ ఇంజెక్షన్ ఇచ్చారు. దీనివల్ల పేషెంట్‌కు వెంటనే ఫిట్స్, అనంతరం కార్డియాక్ అరెస్ట్ తో రాత్రి 10 గంటల సమయంలో మరణించినట్లు ప్రాధమిక విచారణలో తేలింది. ఇందులో అసిస్టెంట్ ప్రొఫెసర్ పర్యవేక్షణా లోపం కూడా కారణమని తేలింది.

అలాగే రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో నవంబర్ 8న 55 ఏళ్ల రోగికి అక్టోబర్ 2025 తేదీతో గడువు ముగిసిన మందులు ఇవ్వడంతో వాటిని వాడిన రోగి మరింత అనారోగ్యం పాలయ్యారు. ఈ రెండు సంఘటనలపై ఆగ్రహం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. సంబంధిత వైద్య సిబ్బందిపై పూర్తి స్థాయి విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. కాకినాడ జీజీహెచ్‌లో మృతి చెందిన గర్భిణీ కుటుంబానికి సాయం అందించాలని సీఎం అధికారులకు సూచించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని అధికారులకు సూచించారు.












Click it and Unblock the Notifications