సీఎం జగన్ టూర్ - కొత్త టర్న్ : ప్రధానితో సహా - చంద్రబాబుకు చెక్ పెట్టేలా..!!
ముఖ్యమంత్రి జగన్ అభివృద్ధి విస్మరించారు. ఒక్క పరిశ్రమ లేదు. అభివృద్ధి లో ఏపీ వెనక్కు వెళ్లిపోయింది. వీటికి సీఎం జగన్ చెప్పబోతున్న సమాధానం ఏంటి. ప్రభుత్వ వర్గాల్లో వినిపిస్తున్న అంచనాలు ఎలా ఉన్నాయి. ముఖ్యమంత్రి జగన్ మూడేళ్ల పాలన పూర్తయింది. ఈ మూడేళ్ల కాలంలో సీఎం పూర్తిగా తన మేనిఫెస్టో అమలు..సంక్షేమం పైనే ఫోకస్ చేసారు. దానిని ప్రధానంగా ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే లక్షా 30 వేల కోట్లకు పైగా ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా లబ్దిదారులకు అందించారు. ఈ రెండేళ్లలోనూ దీనినే కొనసాగించనున్నారు.

జగన్ టూర్ సక్సెస్ అయితే...
అయితే, ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు స్వీకరించిన తరువాత ఏపీలో అభివృద్ధి పూర్తిగా నిలిచిపోయిందనేది ప్రతిపక్షాల ప్రధాన విమర్శ. రాజధాని వివాదంతో పాటుగా చెప్పుకోదగిన స్థాయిలో కొత్త పరిశ్రమలు రాలేదు. ఉపాధి కల్పన ఆశించిన స్థాయిలో లేదు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలోనూ ప్రతీ ఏటా క్యాలెండర్ ప్రకటించి..భర్తీ చేస్తామని చెప్పినా..అది ఆచరణలో అమలు కావటం లేదు. అయితే, సంక్షేమంలో అందిస్తున్న ప్రత్యక్ష నగదు పథకాలతో ... అభివృద్ధి జరగదా..అది అభివృద్ధి కాదా అంటూ వైసీపీ నేతలు ప్రశ్నిస్తూ వచ్చారు. అయితే, ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ తన టీంతో కలిసి తొలి సారి ఏపీలో పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా దావోస్ పర్యటనకు వెళ్తున్నారు. ఈ నెల 22 నుంచి 26వ తేదీ వరకు నిర్వహించే వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సుకు ముఖ్యమంత్రి బృందం హాజరుకానుంది.

గతంలో చంద్రబాబు దావోస్ కేంద్రంగానే
ఈ టీంలో ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ సహా పలువురు అధికారులు ఉన్నారు. ఈ సారి ఇదే సదస్సుకు ప్రధాని మోదీ..కేంద్ర మంత్రులతో పాటుగా దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలకు చెందిన సీఎంలు..మంత్రులు హాజరవుతున్నారు. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రతీ ఏటా దావోస్ లో జరిగే సదస్సుకు హాజరయ్యే వారు. దావోస్ కేంద్రంగా పలురంగాలకు చెందిన ప్రముఖులతో సమావేశం అయ్యేవారు. ఆ సమయంలో దాని గురించి పెద్ద ఎత్తున ప్రచారం సాగేది. ఇప్పుడు సీఎం హోదాలో తొలి సారి సీఎం జగన్ పెట్టుబడుల సదస్సుకు వెళ్తున్నారు. ఈ పర్యటన ఒక విధంగా సీఎం జగన్ సమర్ధతకు పరీక్షగా మారనుంది.

దాదాపు 30 అంతర్జాతీయ సంస్థలతో సమావేశం
అక్కడ 30 ఎంఎన్సీ ప్రతినిధులతో సమావేశం కానున్నారు. ఇప్పటి వరకు సంక్షేమం పైనే ఫోకస్ పెట్టిన సీఎం..ఇక, ఏపీలో పెట్టుబడులను ఆకర్షించి..అభివృద్ధి పరంగానూ ముందుకు తీసుకెళ్లటంలో ఇది కీలక అడుగుగా భావిస్తున్నారు. ఏపీకి కొత్త పరిశ్రమలు..పెట్టుబడులు కొంత స్థాయిలో వచ్చినా..వాటికి ప్రచారం లేదు. కానీ, పెట్టుబడులు తీసుకురావటం లో ఈ పర్యటనలో ముఖ్యమంత్రి సక్సెస్ అయితే, అది రాజకీయంగానూ కొత్త మలుపు తీసుకొనే అవకాశం ఉంది. ఇప్పటి వరకు మహిళలకే పథకాల్లో ప్రాధాన్యత ఇచ్చారు.

రాజకీయంగానూ సీఎం జగన్ కు కీలకంగా
పెట్టుబడులు - పరిశ్రమలు తీసుకురావటంలో ముందడుగు వేస్తే..అది యువత పైన ప్రభావం చూపే అవకాశం ఉంటుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అందునా ప్రధానితో సహా...కేంద్ర మంత్రులు సైతం హాజరయ్యే సమావేశం కావటంతో ఈ టూర్ కు మరింత ప్రాధాన్యత పెరుగుతోంది. సీఎం జగన్ వ్యక్తిగతంగా వ్యాపార రంగంలో సక్సెస్ అయ్యారు. ఇక, ఇప్పుడు సీఎంగా ఏపీకి పెట్టుబడుల ఆకర్షణలో వేస్తున్న అడుగులతో ఎంత మేర విజయం సాధిస్తారు..అది రాజకీయంగా ఏ మేర సహకరిస్తుందనేది దావోస్ పర్యటనలో స్పష్టత రానుంది.












Click it and Unblock the Notifications