చరిత్రలో ఎప్పుడూ ఇంత డబ్బు ఇవ్వలేదు - టీడీపీ ప్రభుత్వంలో ఏం చేసారంటే : సీఎం జగన్..!!
రాష్ట్రంలో రోడ్ల దుస్థితిపైన కొంత కాలంగా విపక్షాలు ఫైర్ అవుతున్నాయి. ప్రభుత్వం రోడ్లు కూడా వేయటం లేదంటూ విమర్శించాయి. ఈ సమయంలో రోడ్ల మరమ్మత్తులపైన గతంలోనే ఆదేశాలు జారీ చేసారు. దీని కోసం రూ 2,205 కోట్లు మంజూరు చేసారు. ఈ రోజున సీఎం జగన్ రోడ్ల మరమ్మత్తులు..టెండర్ల ప్రక్రియ పైన ఉన్నత స్థాయి సమీక్ష చేసారు. ఇప్పటివరకూ 83 శాతం రోడ్డు పనులకు టెండర్లు పూర్తి చేశామని అధికారులు తెలపగా, నెలఖరు నాటికి 100 శాతం టెండర్లు పూర్తవుతాయని పేర్కొన్నారు. ఇదే సమయంలో గత ప్రభుత్వ హాయంలో రోడ్ల నిర్వహణను పట్టించుకోలేదంటూ సీఎం ఆగ్రహం వ్యక్తం చేసారు.

ప్రతిపక్షాలు విష ప్రచారం చేస్తున్నాయి
ఈ ఏడాది వర్షాలు బాగా పడటంతో రోడ్లు బాగా దెబ్బ తిన్నాయని సీఎం అభిప్రాయపడ్డారు. అయితే, ప్రస్తుత ప్రభుత్వ హాయంలోనే రోడ్లన్నీ పాడైపోయినట్లుగా వక్రీకరించి.. ఒక ముద్ర వేసి విషప్రచారం చేస్తున్నారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేసారు. ఒక ఏడాదిలో రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ కూడా ఇంత డబ్బు ఇవ్వలేదు.. ఖర్చు చేయలేదని సీఎం చెప్పుకొచ్చారు. మే చివరి నాటికి దాదాపుగా రోడ్లు నిర్మాణం, మరమ్మతుపనులు పూర్తిచేస్తామని అధికారులు వివరించారు. విశాఖ బీచ్‌కారిడార్ రోడ్డుపై సీఎం సమీక్షచేసారు

జూన్ నాటికి రోడ్లు పూర్తి చేయాలి
విశాఖపట్నం పోర్టు నుంచి భీమిలి - భోగాపురం - తిరిగి ఎన్‌హెచ్-16కు అనుసంధానం అయ్యే బీచ్‌కారిడార్ రోడ్డు నిర్మాణం కోసం తీసుకుంటున్న చర్యలను సీఎంకు అధికారులు వివరించారు. రోడ్డు నిర్మాణరీతుల(డిజైన్)పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సీఎం సూచించారు. ఈ బీచ్ కారిడార్ ప్రపంచంలోనే అత్యుత్తమమైనదిగా నిలవాలని స్పష్టం చేసారు. విశాఖ నగరం నుంచి భోగాపురం ఎయిర్ పోర్టుకు వీలైనంత త్వరగా చేరుకోవాలి, అలాగే ఎయిర్ పోర్టు నుంచి కూడా నగరానికి వీలైనంత త్వరగా రావాలని నిర్దేశించారు.

విశాఖ బీచ్ కారిడార్ పైన స్పష్టత
దీంతోపాటు ఈ రహదారిని అనుకుని టూరిజం ప్రాజెక్టులు వస్తాయని సీఎం చెప్పుకొచ్చారు. ఈనేపథ్యంలో ఈ రోడ్డుకు అత్యంత ప్రాధాన్యత ఏర్పడిందన్నారు. ఇప్పుడున్న విమానాశ్రయంలో పౌరవిమానాలు రాకపోకలపై నిరంతరం ఆంక్షలు ఉంటున్నాయని సీఎం చెప్పారు. రాత్రి పూట ల్యాండింగ్ కూడా నేవీ ఆంక్షలు కారణంగా కష్టం అవుతోందని పేర్కొన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో నేపథ్యంలో బీచ్ కారిడార్‌కు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని సీఎం జగన్ స్పష్టం చేసారు.












Click it and Unblock the Notifications