తల్లి విజయమ్మతో కలిసి తండ్రి పేరుతో పురస్కారాలు : ఒకే వేదిక మీదకు- వైఎస్సార్ అవార్డుల ప్రధానం..!!
సీఎం జగన్ తన తండ్రి పేరుతో అందచేస్తున్న అవార్డుల కార్యక్రమానికి తల్లితో కలిసి హాజరయ్యారు. గవర్నర్ తో అవార్డులు ప్రధానం చేయించినా...తల్లి విజయమ్మ హజరు అందరినీ ఆకర్షించింది. ముఖ్యమంత్రి గా ప్రమాణ స్వీకారం నాడు తల్లి విజయమ్మకు సైతం తెలంగాణ...తమిళనాడు ముఖ్యమంత్రులతో కలిసి వేదిక పైన అవకాశం కల్పించారు. ఆ తరువాత ఇడుపుల పాయలో జరిగే కార్యక్రమాల్లో మాత్రమే జగన్ - విజయమ్మ కలిసి ఒకే కార్యక్రమంలో కనిపించే వారు. ఇక, షర్మిల తెలంగాణలో పార్టీ ఏర్పాటు తరువాత విజయమ్మ ఎక్కువ సమయం అక్కడే ఉంటున్నారు.

తల్లితో కలిసి వేదిక పైకి సీఎం
ఇక, జూలై 8న వైఎస్సార్ జన్మదినం సందర్బంగా హైదరాబాద్ లో విజయమ్మ వైఎస్సార్ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఆ కార్యక్రమంలో సీఎం జగన్ సహా వైసీపీ నేతలు ఎవరూ హాజరు కాలేదు. ఆ కార్యక్రమం షర్మిల రాజకీయ భవిష్యత్ కోసం ఏర్పాటు చేసిందనే అభిప్రాయం వైసీపీ నేతలు వ్యక్తం చేసారు. ఇక, ఇంటర్వ్యూలో సైతం షర్మిల తన తల్లి పాత్రను స్పష్టం చేసారు. వైసీపీ గౌరవాధ్యక్షురాలిగా ఉన్నారు. తన తల్లిగా తనకు మద్దతుగా నిలిచారని చెప్పుకొచ్చారు. ఇక, ఇప్పుడు తన తండ్రి పేరుతో పురస్కారాలు అందచేస్తుండటంతో..తన తల్లిని జగన్ ఆహ్వానించారు.

తండ్రి పేరుతో అవార్డుల వేళ..
విజయమ్మతో కలిసే వేదిక పైకి వచ్చారు. గవర్నర్ కు పరిచయం చేసారు. అవార్డుల ప్రధానం చేసే సమయంలోనే ముందుకు రావాలని కోరారు. రాష్ట్ర అవతరణ దినోత్సం అయిన నవంబర్ 1న ప్రతీ ఏటా వైఎస్సార్ పురస్కారాలు అందిస్తామని జగన్ ప్రకటించారు. వైఎస్సార్ వైద్య వృతి చేసినా.. వ్యవసాయం, విద్యారంగాలకు విశేష కృషి చేశారని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలు ఎంతో విశిష్టమైనవన్నారు. వ్యవసాయం, ఆక్వా, ఉత్పత్తుల ఎగుమతుల్లో ఏపీ అగ్రస్థానం ఉందన్నారు. కరోనా వ్యాక్సినేషన్లోనూ ఏపీ క్రియాశీలకంగా ఉందన్నారు.

ప్రతీ ఏటా వైఎస్సార్ పేరుతో అవార్డులు
రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని జగన్నాథుడని ప్రార్థిస్తున్నానని గవర్నర్ అన్నారు. వైఎస్సార్ అవార్డులు అందుకున్నవారికి ఆయన అభినందనలు తెలిపారు. నేలపై ఉండి ఆకాశమంత ఎదిగిన వ్యక్తి దివంగత మహానేత వైఎస్సార్ అని.. అలాంటి వ్యక్తి వైఎస్సార్ పేరుమీద అవార్డులు ఇచ్చేందుకు నిర్ణయించామని ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు. కులం, మతం, రాజకీయ పార్టీలకు అతీతంగా అవార్డుల ఎంపిక జరిగిందన్నారు. కేవలం సేవలను పరిగణలోకి తీసుకుని అవార్డులకు ఎంపిక చేశామన్నారు. సామాన్యులుగా ఉండే అసమాన్యుల ప్రతిభకు పట్టం కట్టామన్నారు.

విభిన్న రంగాల ప్రముఖులకు ప్రధానం
కళలు, సంస్కృతికి అవార్డుల్లో పెద్దపీట వేశామన్నారు. రైతులు, రచయితలు, జర్నలిస్టులు, ఫ్రంట్‌లైన్ వారియర్స్‌ను ఎంపిక చేశామంటూ సీఎం వివరించారు. ఎనిమిది ట్రస్టులకు... 11 మంది రైతులకు...కళలు-సంస్కృతి విభాగాలకు..సాహిత్య రంగంలోని ప్రముఖులకు..జర్నలిజంలో నిష్టాతులకు...కరోనా సమయంలో ఉత్తమ సేవలందించిన వైద్య-ఆరోగ్య విభాగానికి చెందిన వారికి ఈ అవార్డులు రాష్ట్ర ప్రభుత్వం అందచేసింది.












Click it and Unblock the Notifications