సొంత జిల్లాలో సీఎం జగన్ పర్యటన - బద్వేలు ఉప ఎన్నిక వేళ : రెండు రోజుల టూర్..!!
ముఖ్యమంత్రి జగన్ సొంత జిల్లా కడపలో రెండు రోజుల పర్యటన ఖరారైంది. ఆయన తన సొంత నియోజకవర్గం పులివెందుల వెళ్లనున్నారు. అక్టోబర్ రెండవ తేదీ మధ్నాహ్నం సీఎం జగన్ తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి బయల్దేరి సాయంత్రం నాలుగు గంటలకు కడప విమానాశ్రయానికి చేరుకుంటారు. ఇడుపులపాయలో పార్టీ నేతలు..జిల్లా నాయకులతో సమావేశం అవుతారు. ఆ రాత్రికి ఇడుపులపాయ లోని వైఎస్సార్ ఎస్టేట్ లో బస చేస్తారు. అక్టోబర్ 3న సీఎం తన మామ డాక్టర్ ఈసీ గంగిరెడ్డి ప్రధమ వర్దంతి కావటంతో ఆ కార్యక్రమాల్లో పాల్గొంటారు.
ఉదయం 10గంటలకు పులివెందులలోని లయోలా డిగ్రీ కాలేజీ రోడ్డులో ఉన్న సమాధి వద్దకు చేరుకొని నివాళులు అర్పిస్తారు. 10.30కి భాకరాపురంలోని ఆడిటోరియంలో జరిగే ప్రార్థనల్లో పాల్గొంటారు. ఆ తర్వాత 11.40 గంటలకు భాకరాపురంలోని నివాసానికి వెళ్తారు. మధ్యాహ్నం 12.40కి కడప ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరి 1.30కి గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన మధ్యాహ్నం 2కి తాడేపల్లిలోని నివాసానికి వెళ్తారు. ఇప్పటికే బద్వేలు ఉప ఎన్నికకు సంబంధించి షెడ్యూల్ విడుదల అయింది.

బద్వేలు వైసీపీ అభ్యర్దిగా డాక్టర్ సుధను సీఎం ఎంపిక చేసారు. ఉప ఎన్నిక బాధ్యతను సీనియర్ మంత్రి పెద్దిరెడ్డికి అప్పగించారు. కడప జిల్లా ఎమ్మెల్యేల కు సీఎం నియోజకవర్గంలోని మండలాలా వారీగా బాధ్యతలు కేటాయించారు. 2019 లో వచ్చిన 44 వేల కంటే ఎక్కువ మెజార్టీ వచ్చేలా పని చేయాలని నిర్దేశించారు. ఈ నెల 4వ తేదీ నుంచి ప్రచారం మొదలు పెట్టాలని స్పష్టం చేసారు. ఈ పర్యటన సమయంలో బద్వేలు నియోజకవర్గానికి చెందిన పార్టీ నేతలు సీఎంను కలిసేందుకు ప్రయత్నిస్తున్నారు.
Recommended Video
వారితోనూ సీఎం సమావేశం కానున్నారు. ఇక, రానున్న సార్వత్రిక ఎన్నికలకు ముందు మరో ఎన్నిక వచ్చే అవకాశం లేదు. దీంతో..ఈ ఉప ఎన్నికలో భారీ మెజార్టీ సాధించి..ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉందనే ప్రతిపక్షాల విమర్శలకు సమాధానం చెప్పాలని సీఎం ఇప్పటికే పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేసారు. దీంతో..ముఖ్యమంత్రి జగన్ కడప జిల్లా పర్యటన ప్రయివేటు కార్యక్రమాలు..పార్టీ నేతల సమావేశాలకే పరిమితం కానుంది.












Click it and Unblock the Notifications