కాబోయే గవర్నర్ నజీర్ తో జగన్ భేటీ-గంటసేపు కీలక చర్చ-రేపు బాధ్యతల స్వీకారం..
ఏపీ కొత్త గవర్నర్ గా నియమితులైన జస్టిస్ సయ్యద్ అబ్దుల్ నజీర్ తో ఇవాళ సీఎం జగన్ భేటీ అయి కీలక చర్చలు జరిపారు. రేపు ఆయన ప్రమాణ స్వీకారం నేపథ్యంలో వీరిద్దరి భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.
కేంద్రం చేసిన గవర్నర్ల మార్పులో ఏపీ పాత గవర్నర్ హరిచందన్ ఛత్తీస్ ఘడ్ కు బదిలీ అయ్యారు. ఆయన స్ధానంలో కొత్త గవర్నర్ గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సయ్యద్ అబ్దుల్ నజీర్ నియమితులయ్యారు. దీంతో జస్టిస్ నజీర్ నిన్న సాయంత్రం ఏపీకి చేరుకున్నారు. ఆయనకు సీఎం జగన్ ఘనస్వాగతం పలికారు.
ఇవాళ విజయవాడ రాజ్ భవన్ కు వెళ్లి సీఎం జగన్ కొత్త గవర్నర్ కాబోతున్న జస్టిస్ నజీర్ తో మరోసారి భేటీ అయ్యారు. గంటసేపు ఏకాంతంగా ఆయనతో చర్చలు జరిపారు. ఇందులో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మూడు రాజధానుల వివాదం, రాష్ట్రంలో నెలకొన్న పరిస్ధితులు, సవాళ్లపై వీరిద్దరూ చర్చించినట్లు సమాచారం. గంటసేపటికి పైగా సాగిన వీరిద్దరి భేటీలో రేపు గవర్నర్ ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఏర్పాట్లపైనా చర్చించినట్లు తెలుస్తోంది.

ఏపీ గవర్నర్ గా రేపు రాజ్ భవన్ లో జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. వచ్చే ఏడాది ఎన్నికల నేపథ్యంలో కేంద్రం ఆయన్ను తొలిసారి గవర్నర్ గా నియమించింది. దీంతో కేంద్రం ఉద్దేశం ఏంటో అన్నది తేలడం లేదు. ముఖ్యంగా వైసీపీ సర్కార్ తో ప్రస్తుతానికి సత్సంబంధాలు కొనసాగిస్తున్నా భవిష్యత్తులో పరిస్దితులు మారితే గవర్నర్ కీలకంగా మారతారు. ఈ నేపథ్యంలో గవర్నర్ మార్పు ప్రాధాన్యం సంతరించుకుంది. ముఖ్యంగా మూడు రాజధానుల వ్యవహారంపై సుప్రీంకోర్టు తీర్పు వెలువడే అవకాశాలున్న నేపథ్యంలో గవర్నర్ మార్పు ప్రభావం చూపే అంశంగానే భావిస్తున్నారు.













Click it and Unblock the Notifications