సీడ్స్ కంపెనీ సీజ్ -ఉన్నత స్థాయి కమిటీకి సీఎం ఆదేశం : బాధితుల సాయం పై ఆరా..!!
అచ్యుతాపురం సెజ్ సీడ్స్ కంపెనీలో విషవాయువు లీకేజీపై ముఖ్యమంత్రి జగన్ కీలక ఆదేశాలు ఇచ్చారు. సెజ్ లో గ్యాస్ లీకైన ఘటనపైన ఇప్పటికే ప్రభుత్వం స్పందిచింది. తక్షణమే సీడ్స్ కంపెనీని మూసివేయాలని ఆదేశించింది. లీకేజీకి కారణాలు తెలిసి..విచారణ పూర్తయ్యే వరకూ ఫ్యాక్టరీ తెరవద్దని స్పష్టం చేసింది. ఇదే సమయంలో సీఎం జగన్ ప్రమాదం పైన ఆరా తీసారు. బాధితులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గ్యాస్ లీక్ ఘటనపై ఉన్నత స్థాయి కమిటీకి సీఎం ఆదేశాలు జారీ చేసారు.
బాధితులకు అందుతున్న వైద్య సహాయం పై ఆరా తీసిన సీఎం జగన్.. గ్యాస్ లీక్ అంశాన్ని తీవ్రంగా పరిగణించాలని నిర్దేశించారు. ఘటన పై ఒక ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని సూచించారు. కారణాలను వెలికితీయడమే కాకుండా, భవిష్యత్తులో ఇలాంటివి జరక్కుండా తీసుకోవాల్సిన చర్యలపైనా దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. దీంతోపాటు రాష్ట్రంలోని అన్ని పరిశ్రమల్లో కూడా సేఫ్టీ ఆడిట్ జరిపించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేసారు. విషవాయువు లీకేజీ సంఘటనలో గాయపడిన బాధితులను మంత్రి అమర్ నాధ్ పరామర్శించారు.

వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. గతంలో జరిగిన విష వాయువు లీకేజీపై విచారణ జరుగుతుండగా మరోసారి ప్రమాదం జరగడం దురదృష్టకరమన్నారు. బాధితుల్లో ఎవరికీ ప్రాణాపాయం లేదని తెలిపారు. కాంప్లెక్స్ రసాయనాలు ఉన్నట్లు ప్రాథమిక నివేదికలో తేలిందన్నారు. జరిగిన ప్రమాదంపై నమూనాలను ఐసీఎమ్‌ఆర్‌కు పంపుతున్నట్లు చెప్పారు. ప్రస్తుత ప్రమాదంపై ఉన్నత స్థాయి కమిటీ విచారణకు ఆదేశించామని తెలిపారు. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేసారు. రాష్ట్ర స్థాయిలో ఉన్న పరిశ్రమలు అన్నింటిపైన సేఫ్టీ అడిట్ జరుగుతుందని వెల్లడించారు.












Click it and Unblock the Notifications