ముఖ్యమంత్రి జగన్ చెప్పినదాని ప్రకారం 50 సీట్లు రావాలి??
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి చెప్పినదాని ప్రకారం తనకు 40 నుంచి 50 వరకు అసెంబ్లీ సీట్లు వచ్చివుండాల్సిందని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. తాను ఒక కులానికి చెందినవాడినైతే, ఆ కులమంతా తనకు ఓట్లు వేసినట్లైతే అన్ని సీట్లు సాధించగలిగేవాడిననేది పవన్ అభిప్రాయం. కానీ గత ఎన్నికల్లో జనసేన రాజోలు సీటును ఒక్కదాన్నే గెలుచుకోగలిగింది. అక్కడి నుంచి విజయం సాధించిన రాపాక వరప్రసాద్ వైసీపీకి అనుబంధ సభ్యుడిగా కొనసాగుతున్నారు. పవన్ కూడా భీమవరం, గాజువాక నుంచి పోటీచేసినప్పటికీ స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.

ఒక సామాజికవర్గానికే పరిమితం చేశారు
తాను రాజకీయాల్లోకి వచ్చింది కులాల వారీగా రాజకీయం చేయడానికి కాదని, సమసమాజ స్థాపన కోసమని వపన్ చెబుతున్నారు. కులం ఆధారిత ఓటు కోసం పయనించవద్దని పార్టీ శ్రేణులకు ఆయన దిశానిర్ధేశం చేస్తున్నారు. జనసేన పార్టీని స్థాపించినప్పటినుంచి ఆయన్ను కేవలం ఒక సామాజికవర్గానికి మాత్రమే ఇతర రాజకీయ పక్షాలు పరిమితం చేశాయి. ఆ పరిమితుల నుంచి బయట పడటానికి, వారి విమర్శలను ధీటుగా తిప్పకొట్టడంలో పవన్ వైఫల్యం చెందారని చెప్పవచ్చు. నిజాయితీగా, కులమతాలకు అతీతంగా రాజకీయం చేయాలి.. స్వచ్ఛమైన పరిపాలన అందించాలి.. డబ్బుల్లేకుండా కేవలం ప్రజల అభిమానం మీద ఓట్లు సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఆకాంక్షించారు.

బూర్జువా పార్టీల మాదిరిగా మారిపోవాలా?
సెక్యులరిజం ఆధారంగా పవన్ మాట్లాడుతున్నప్పటికీ ప్రస్తుత రాజకీయ పరిణామాలన పరిశీలిస్తున్నప్పుడు ఆయన కూడా ఇప్పుడున్న బూర్జువా పార్టీలమాదిరిగా మారిపోక తప్పదనిపిస్తోంది. వ్యవస్థను బాగు చేయాలనే తపన ఉన్నప్పటికీ దానికి అడ్డుపడే శక్తులు ఎన్ని ఉంటాయి? ఎలా ఉంటాయి? వాటిని ఎలా ఎదుర్కోవాలి? తదితర విషయాలపై పవన్ కు ఇప్పుడిప్పుడే ఒక స్పష్టత వస్తోంది. కాలంతో పాటు మనం మారిపోవడమా? లేదంటే మనం మారకుండా విలువలతో కూడిన రాజకీయం చేయడమా? అనే సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతున్నారు.

ఆర్థిక బలం అవసరమేగా..!
ఇటువంటి సందిగ్ధావస్థలో ఉన్న పవన్ జెండా ఆవిష్కరణ సందర్భంగా చేసిన వ్యాఖ్యలను పరిశీలిస్తే జనసేనను కూడా ఇతర పార్టీల మాదిరిగా తీర్చిదిద్దాలనుకుంటున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది. పార్టీ దగ్గర డబ్బులేదు కాబట్టి తాను సినిమాలు చేసి వచ్చిన పారితోషికాన్ని పార్టీకోసం ఖర్చుపెట్టాలి. ప్రస్తుతం ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలకు రూ.లక్ష చొప్పున అందిస్తున్నారు. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలంటే అందుకు అవసరమైన ఆర్థిక బలాన్ని సమకూర్చుకోవాలనే విషయం ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. భవిష్యత్తులో ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో వేచిచూద్దాం.












Click it and Unblock the Notifications