మమత కోసం ఎంపీ పదవికి పఠాన్ రాజీనామా ? లాబీయింగ్ పై గంగూలీ క్లారిటీ..!
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ ఓటమితో పాటు స్వయంగా తాను కూడా ఓటమి పాలైన మమతా బెనర్జీ ఇప్పుడు తీవ్ర సంక్షోభంలో ఉన్నారు. ఇప్పటికే పార్టీలో సగానికి పైగా ఎమ్మెల్యేలు రెబెల్స్ గా మారి విపక్ష నేతా పదవి కూడా సంపాదించుకున్నారు. అలాగే 20కి పైగా ఎంపీలు కూడా బీజేపీతో టచ్ లో ఉన్నారు. ఈ నేపథ్యంలో తానే స్వయంగా రంగంలోకి దిగిన మమతా బెనర్జీ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇందులో భాగంగా తానే పార్లమెంట్ కు వెళ్లాలని నిర్ణయించుకున్న మమతా బెనర్జీ.. ఆ మేరకు టీఎంసీ ఎంపీ యూసుఫ్ పఠాన్ ను రాజీనామా చేయాలని కోరినట్లు ప్రచారం జరుగుతోంది. ఆయన రాజీనామా చేస్తే ఆ స్ధానానికి వచ్చే ఉపఎన్నికలో పోటీ చేసి ఎంపీ కావాలని మమత భావిస్తున్నారు. అయితే ఇందుకోసం పఠాన్ తో లాబీయింగ్ చేసేలా బెంగాల్ క్రికెట్ సంఘం అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ (sourav ganguly)ని కోరినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. దీనిపై గంగూలీ ఇవాళ స్పందించారు.

పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తరపున తాను యూసుఫ్ పఠాన్‌ను సంప్రదించానని, రాబోయే ఉప ఎన్నికలలో ఆమె పోటీ చేసేందుకు వీలుగా, ఆ నియోజకవర్గానికి ఎన్నికైన ప్రతినిధిగా ఉన్న తన రాజ్యాంగబద్ధమైన పదవికి రాజీనామా చేయాలని ఆమె సందేశాన్ని అందించానని ఆరోపణలు వచ్చాయని గంగూలీ తెలిపారు. ఈ ఆరోపణలు అవాస్తవం అన్నారు. వదంతులు, ఊహాగానాలకు బలికావద్దని తాను మీడియాను కోరుతున్నట్లు గంగూలీ ఓ ప్రకటనలో తెలిపారు. దీంతో ఇవన్నీ ఊహాగానాలేనని తేలిపోయింది.














Click it and Unblock the Notifications