CM Jagan: వైసీపీ విజయాన్ని ఆపలేరు.. జూన్ 4నుంచి విశాఖ నుంచే పాలన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కుతంత్రాలతో సంక్షేమ పథకాలను ఆపగలరు కానీ, వైసీపీ విజయాన్ని ఎవరు ఆపలేరని వైయస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో భారీ బహిరంగ సభలో మాట్లాడిన సీఎం జగన్ విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా చేస్తామని, ఈసారి ఎన్నికల్లో విజయం సాధించి విశాఖ నుండి ప్రమాణస్వీకారం చేస్తానన్నారు.
ఏపీలో సంక్షేమ పథకాలు అందకుండా చంద్రబాబు కుట్రలు
ఉద్దానం సమస్యను పరిష్కరించామని, కిడ్నీ ఆసుపత్రి, రీసర్చ్ సెంటర్ ను ఏర్పాటు చేశామని, మూడు జిల్లాలను, ఆరు జిల్లాలుగా చేసి అభివృద్ధికి దోహదం చేశామన్నారు వైయస్ జగన్. ఏపీలో ప్రజలకు సంక్షేమ పథకాలు అందకుండా చంద్రబాబు కుట్రలు చేస్తున్నాడని మండిపడిన జగన్, ఢిల్లీ వాళ్లతో కలిసి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని పేర్కొన్నారు.

మేనిఫెస్టోలోని హామీలు 99 శాతం అమలు
బటన్లు నొక్కిన సొమ్ము పేదలకు అందకుండా కుట్రలు చేస్తున్నారని, ఏం చేసినా మా విజయాన్ని ఆపలేరని తేల్చి చెప్పారు. 59 నెలల్లో రాష్ట్రంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చామని, అక్క చెల్లెళ్లకు రెండు లక్షల 70 వేల కోట్ల రూపాయలు ఇప్పటివరకు నేరుగా అందించామని, మేనిఫెస్టోను భగవద్గీత, ఖురాన్, బైబిల్ గా భావించామని పేర్కొన్నారు. మేనిఫెస్టోలోని హామీలను 99 శాతం అమలు చేశామన్నారు.
తాము అందించిన సంక్షేమం చంద్రబాబు హయాంలో సాధ్యమైందా?
జగన్, తమ హయాంలో విద్యార్థుల కోసం అందించిన విద్యా కానుక, గోరుముద్ద, అమ్మబడి, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పథకాలను గురించి వివరించారు. విద్యారంగంలో మేము చేసిన అభివృద్ధి బాబు హయాంలో సాధ్యమైందా చెప్పాలని ప్రశ్నించారు. మహిళలకు, రైతులకు వైసిపి పాలనలో అందిన సంక్షేమం, చంద్రబాబు పాలనలో అందిందా చెప్పాలన్నారు.
అధికారంలోకి రాగానే అన్ని పథకాలు మళ్ళీ అందిస్తాం
జూన్ 4వ తేదీన మీ బిడ్డ అధికారంలోకి వస్తాడని, అధికారంలోకి వచ్చిన వెంటనే నిలిపివేసిన అన్ని పథకాలను మళ్లీ అందిస్తామని పేర్కొన్నారు. చంద్రబాబు దగ్గర ప్రజలను దోచేసిన డబ్బు చాలా ఉందని, ఆ డబ్బును ఇస్తే తీసుకోవాలని, కానీ ఓటేసే ముందు ఆలోచించాలని జగన్ పేర్కొన్నారు. మీరు వేసే ఓట్లతో ఢిల్లీ పీఠం కదలాలని, బాబుకు మీరంతా గట్టిగా బుద్ధి చెప్పాలన్నారు వైయస్ జగన్.












Click it and Unblock the Notifications