సొంత ఆదాయ మార్గాలు చూడండి - రాబడులను పెంచుకోవాలి : సీఎం జగన్ నిర్దేశం..!!
సొంత ఆదాయ మార్గాలను పెంచుకొనేందుకు అందుబాటులో ఉన్న మార్గాలను అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి జగన్ నిర్దేశించారు. ఆదాయాన్ని ఆర్జించే శాఖలతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఆదాయం పెచుకోవటానికి వివిధ రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేయాలని అధికారులకు సీఎం ఆదేశించారు. ఎస్‌ఓఆర్(రాష్ట్రాల సొంత ఆదాయం)ను పెంచుకోవడానికి ఆయా రాష్ట్రాల్లో ఎలాంటి పద్ధతులు, విధానాలు పాటిస్తున్నారో పరిశీలించాలన్నారు. తద్వారా రాష్ట్ర సొంత ఆదాయాలు పెరగడానికి తగిన ఆలోచనలు చేయాలని.. వీటిని కార్యరూపంలోకి తీసుకురావడానికి దృష్టిపెట్టాలని సీఎం పేర్కొన్నారు. ఈ అంశాలపై ఎప్పటికప్పుడు పురోగతిని సమీక్షించుకోవడానికి సంబంధిత శాఖలకు చెందిన అధికారులు క్రమం తప్పకుండా సమావేశం కావాలని సీఎం పేర్కొన్నారు.
ప్రభుత్వానికి ఆదాయాన్ని తీసుకురావడంలో కలెక్టర్లు క్రియాశీలకంగా వ్యవహరించాని సూచించారు. పారదర్శక విధానాలను పాటిస్తూ ముందుకు సాగాలన్నారు. రాబడులను పెంచుకునే క్రమంలో అధికారులు తమ విచక్షణాధికారాలను వాడేటప్పుడు కచ్చితమైన ఎస్‌ఓపీలను పాటించాలని స్పష్టం చేసారు. పెండింగ్‌లో ఉన్న వ్యాట్ కేసులను పరిష్కరించడంద్వారా బకాయిలను రాబట్టుకోవడంపై దృష్టిసారించాలని సూచించారు. అదే సమయంలో గ్రామ, వార్డు సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్ల ప్రక్రియను వీలైనంత త్వరగా వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారు. 51 గ్రామ, వార్డు సచివాలయాల్లో ఇప్పటికే అందుతున్న రిజిస్ట్రేషన్ సేవలను సమీక్షించి... తగిన మార్పులు, చేర్పులు చేయాలన్నారు.

సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో వెలుగుచూసిన అవినీతి ఘటనలు, లోపాలు తిరిగి గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రవేశించకూడదని స్పష్టం చేసారు. ఆమేరకు పటిష్టమైన ఎస్‌ఓపీలను అమలు చేయాలన్నారు. ఉచితంగా రిజిస్ట్రేషన్లు వల్ల భారీగా పేదలకు భారీగా లబ్ధి చేకూరిందని అధికారులు వివరించారు. ఓటీఎస్ పథకం ద్వారా, ఉచిత రిజిస్ట్రేషన్ల రూపేణా పేదలకు ఇప్పటివరకూ రూ.400.55 కోట్ల లబ్ధి చేకూరిందని నివేదిక సమర్పించారు. టిడ్కో ఇళ్ల ఉచిత రిజిస్ట్రేషన్ల రూపేణా పేదలకు మరో రూ.1230 కోట్ల మేర లబ్ధి చేకూరిందని చెప్పుకొచ్చారు. గతంలో ఎన్నడూకూడా ఉచిత రిజిస్ట్రేషన్ల రూపంలో పేదలకు ఇంతటి ప్రయోజనం జరగలేదని అధికారులు సీఎంకు నివేదించారు.












Click it and Unblock the Notifications