ఆనం నియోజకవర్గానికి సీఎం జగన్ - ఆట మొదలు..!!
ముఖ్యమంత్రి జగన్ నెల్లూరు జిల్లా పర్యటన ఖరారైంది. వైసీపీ రెబల్ ఎమ్మెల్యే ఆనం నియోజకవర్గం వెంకటగిరికి ముఖ్యమంత్రి రానున్నారు. నెల్లూరు నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీకి కాదని టీడీపీ వైపు మద్దతుగా నిలుస్తున్నారు. టీడీపీలో చేరేందుకు సిద్దమయ్యారు. ఈ సమయంలో సీఎం జగన్ నెల్లూరు జిల్లాలో పర్యటన ఆసక్తి కరంగా మారుతోంది. ఇప్పటికే ఈ మూడు నియోజకవర్గాల్లో వైసీపీ కొత్త ఇంఛార్జ్ లను నియమించింది.
వెంకటగిరిలో జగన్ పర్యటన: ఈ నెల 21న ముఖ్యమంత్రి జగన్ వెంకటగిరి పర్యటన రాకీయంగా ఆసక్తిని పెంచుతోంది. నేతన్న నేస్తం పథకం కింద అక్కడ బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లోకి నగదు జమ చేయనున్నారు. వాస్తవానికి 21వ తేదీన ఈ కార్యక్రమాన్ని మంగళగిరిలో చేపట్టాలని ప్రభుత్వం తొలుత నిర్ణయించింది.

అయితే వెంకటగిరి నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జి నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి వెంకటగిరిలోనే నిర్వహించాలని పట్టుబట్టినట్టు సమాచారం. వెంకటగిరి నియోజకవర్గంలో చేనేత కార్మికులు అధిక సంఖ్యలో వుండడంతో ఇక్కడే ఈ పథకం నిధులు విడుదల చేయాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో రాజకీయంగానూ ఆసక్తి కరంగా మారుతోంది.
జగన్ ఇక తేల్చేస్తారా: 2019 ఎన్నికల్లో జిల్లాలో వైసీపీ మొత్తం పది సీట్లు గెలిచి క్లీన్ స్వీప్ చేసింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ నుంచి నెల్లూరు జిల్లాకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు టీడీపీకి అనుకూలంగా ఓటు వేసారనే కారణంతో ఆ ముగ్గురినీ పార్టీ సస్పెండ్ చేసింది. టీడీపీలో తాము చేరుతున్నట్లు ఇప్పటికే ఆనం, కోటంరెడ్డి స్పష్టం చేసారు.
లోకేశ్ పాదయాత్రలోనూ పాల్గొన్నారు. వెంకటగిరి, నెల్లూరు రూరల్, ఉదయగిరి నియోజకవర్గాల్లో ఇప్పటికే వైసీపీ కొత్త ఇంఛార్జ్ లను నియమించింది. లోకేశ్ పాదయాత్ర వేళ స్థానిక వైసీపీ ఎమ్మెల్యేలను లక్ష్యంగా చేసుకొని ఆరోపణలు చేస్తున్నారు. వీటిని వైసీపీ నేతలు తిప్పి కొడుతున్నారు. ఈ సమయంలోనే ఇప్పుడు నెల్లూరు పైన సీఎం జగన్ ఫోకస్ చేసారు.
టీడీపీ వర్సస్ వైసీపీ: నెల్లూరు జిల్లా వ్యవహారాలను పార్టీ సీనియర్ నేత బాలినేని సమన్వయం చేసేవారు. ఆయన ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. కొత్తగా ఎవరికీ బాధ్యతలు కేటాయించలేదు. కొత్తగా నియమితులైన ఇంఛార్జ్ లను ప్రజల్లోనూ ఉండాలని పార్టీ ఆదేశించింది.
ఈ సమయంలో నెల్లూరు జిల్లాలో టీడీపీ ఎలాగైనా వైసీపీ దెబ్బ తీయాలని భావిస్తోంది. దీంతో..వైసీపీ నాయకత్వం అలర్ట్ అయింది. అందులో భాగంగా.. టీడీపీ కి చెందిన నేతలను తమ వైపు ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. ఈ సమయంలోనే ముఖ్యమంత్రి జగన నెల్లూరు జిల్లాలో పర్యటిస్తుండటంతో...అక్కడ పార్టీ నేతలకు ఏం చెప్పబోతున్నారు..ఎటువంటి వ్యూహం అమలు చేస్తారనేది ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications