మెట్రో మార్పుపై కేసీఆర్ పట్టు, 400 కోట్లు కేటాయింపు
హైదరాబాద్: చారిత్రక కట్టడాలు ఉన్నచోట మెట్రో రైలు మార్గాన్ని మళ్లించాలనే పట్టుదలతో ఉన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తన పంతం నెగ్గించుకుంటున్నారు. మెట్రో రైలు అలైన్‌మెంట్ మార్పుపై కేసీఆర్ పట్టుదలగా ఉండడంతో స్వల్పమార్పులతో పట్టాలెక్కేందుకు రెడీ అవుతోంది.
కేసీఆర్ ఆలోచనకు అనుగుణంగా చారిత్రక కట్టడాలకు ఏమాత్రం భంగం కలగకుండా వాటికి కాస్త దూరం నుంచి వెళ్లేలా అధికారులు కొత్త రూట్ మ్యాప్‌ను సిద్ధం చేశారు. మెట్రో రైలు కోసం చారిత్రక కట్టడాలను కూల్చడంగాని వాటికి నష్టం చేయడాన్నిగాని కేసీఆర్ మొదటినుంచి వ్యతిరేకిస్తూనే ఉన్నారు.

కేసీఆర్ సూచనల ప్రకారం రవీంద్రభారతి, అసెంబ్లీల మీదుగా వెళ్లాల్సిన మెట్రో రూటును నాంపల్లిలో మొదలుకుని తెలుగు విశ్వవిద్యాలయం వెనుక భాగం నుంచి పబ్లిక్ గార్డెన్స్ మీదుగా లక్డీకాపూల్ చేరుకునేలా ఆలైన్‌మెంట్ మార్చనున్నారు.
అలాగే సుల్తాన్ బజార్ మీదుగా వెళ్లాల్సిన దారిని ఉమెన్స్ కాలేజ్ వెనుక నుంచి తీసుకువచ్చి బాటా జంక్షన్ ఎడమ వైపుగా కాచిగూడాకు తీసుకురానున్నారు. అలైన్‌మెంట్ మార్పు వల్ల ఎల్ అండ్ టికి కలిగే నష్టాన్ని మరియు కొత్త అలైన్‌మెంట్‌కు అయ్యే అదనపు ఖర్చు కోసం కేసీఆర్ రూ.400 కోట్లు కేటాయించారు.
ఇప్పటికే లక్డీకాపూల్, సుల్తాన్ బజార్ ప్రాంతాల్లో మెట్రో తన పనులను నిలిపివేసింది. రీ అలైన్‌మెంట్ కారణంగా లక్డీకాపూల్, గన్‌పార్క్, అసెంబ్లీ, రూట్లలో వేసిన సుమారు 21 పిల్లర్లను తొలగించాల్సి వస్తోంది. ఈ విషయంపై ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ రాజీవ్ శర్మ హైదరాబాద్ మెట్రో రైల్ అధారిటీ అధికారులతో చర్చించారు.












Click it and Unblock the Notifications