తెలంగాణ వేగంగా ముందుకు: ఉమాభారతితో కేసీఆర్ భేటీ
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం వేగంగా ముందుకు వెళ్తోందని, కేంద్ర జలవనరుల శాఖ పూర్తిస్థాయి సహకారం అందిస్తుందని కేంద్రమంత్రి ఉమాభారతి అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుతో సోమవారం మధ్యాహ్నం ఉమాభారతితో భేటీ అయ్యారు.
అనంతరం ఉమాభారతి విలేకరులతో మాట్లాడారు. మిషన్ కాకతీయ, ప్రాణహిత - చేవెళ్ల, దేవాదుల ప్రాజెక్టుల పైన చర్చించినట్లు తెలిపారు. చర్చకు వచ్చిన అంశాల పైన సానుకూల దృష్టితో ఉన్నామన్నారు. ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టు జాతీయ హోదా ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. మిషన్ కాకతీయ పైన వారంలో నిర్ణయం తీసుకుంటామన్నారు.
తెలంగాణకు తాము అన్ని విధాలా సహకరిస్తామని చెప్పారు. కేసీఆర్ తన దృష్టికి ముఖ్యంగా మూడు అంశాలు తీసుకు వచ్చారని, వాటిని పరిశీలిస్తామని చెప్పారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌తో మొదటి సమావేశం సానుకూలంగా సాగిందని చెప్పారు.

నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ.. ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని కోరామని, మిషన్ కాకతీయ ప్రారంభోత్సవానికి రావాలని కోరామని, ఆమె అంగీకరించారని చెప్పారు.
పార్లమెంటులోని శ్రమశక్తి భవనంలో జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతితో కేసీఆర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మిషన్ కాకతీయకు సహకరించాలని కోరారు. అలాగే, మిషన్ కాకతీయ ప్రారంభోత్సవానికి రావాలని విజ్ఞప్తి చేశారు.
సత్వర తాగునీటి ప్రయోజన పథకంలో భాగంగా రూ.100 కోట్లు ఇవ్వాలని కేసీఆర్ కోరారు. ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని అడిగారు. దీని పైన త్వరలో నిర్ణయం తీసుకుంటామని ఉమాభారతి చెప్పారు. దేవాదుల ప్రాజెక్టుకు నిధులు మంజూరు చేయాలని కేంద్రమంత్రిని అడిగారు. వీటిపై ఉమాభారతి సానుకూలంగా స్పందించారు. కొత్త రాష్ట్రమైన తెలంగాణకు అన్ని విధాలా సహకరిస్తామని చెప్పారు.












Click it and Unblock the Notifications