విభజన: జెట్ స్పీడుతో కిరణ్ రెడ్డి ఫైళ్ల క్లియరెన్స్
హైదరాబాద్: రాష్ట్ర విభజన ప్రక్రియ వేగంగా జరుగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి కంటి మీద కునుకు లేకుండా పోతోంది. ఎందుకంటే ఇప్పటి వరకు పెండింగ్‌లో ఉన్న వివిధ ఫైళ్లను పరిశీలిస్తూ.. గతంలో ఆమోదం తెలిపిన ఫైళ్లను మరోసారి సమీక్ష చేస్తూ.. కొత్త ఫైళ్లపై సంతకాలు పెడుతూ బిజి బిజీగా గడిపేస్తున్నారు. కొన్ని రోజుల నుంచి రాత్రి పూట కూడా ఫైళ్లను తిరగేస్తున్నారు. తనకు అనుకూలురైన వారికి ఉన్నత పదవులను కట్టబెడుతున్నారు.
కిరణ్ కుమార్ రెడ్డి హయాం(చివరి మూడు నెలల్లో)లో జరిగిన వ్యవహారాలపై ప్రత్యర్థులు విచారణ జరిపే అవకాశం ఉందన్న నేపథ్యంలో వివిధ ఫైళ్లను ఆయన క్లియరెన్స్ చేస్తున్నట్లు సమాచారం. ప్రైవేటు పార్టీలకు లబ్ధి చేకూర్చేలా ముఖ్యమంత్రి నిర్ణయాలున్నాయని ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే.

ముఖ్యమంత్రి కిరణ్ హయాంలో ఏయే ఫైళ్లపై సంతకాలు చేశారో విచారణ జరిపించాలని తెలంగాణ రాష్ట్ర సమతి ఎమ్మెల్యే హరీశ్ రావు ఇప్పటికే డిమాండ్ చేశారు. చిత్తూరు జిల్లాకు ప్రత్యేకంగా తాగునీటి పథకం కోసమని చెప్పి రూ. 200 కోట్లను సిఎం కిరణ్ కుమార్ రెడ్డి కేటాయించారు. దీనితోపాటు విభజన తర్వాత రెండు రాష్ట్రాలకు ఇబ్బందులు కలిగించేలా సిఎం నిర్ణయాలను తీసుకుంటున్నారని హరీశ్ ఆరోపించారు.
ఈ నేపథ్యంలో తన హయాంలో జరిగిన నిర్ణయాలపై మరోసారి పునర్ సమీక్ష చేయడంతోపాటు కొత్త వాటికి ఆమోదం తెలపడంలో సిఎం కిరణ్ మునిగిపోయారు. ఇందుకోసం పగలు రాత్రిళ్లు కేటాయిస్తున్నట్లు సమాచారం. శుక్రవారం కూడా చాలా మంది ఎమ్మెల్యేలు తీసుకొచ్చిన ఫైళ్లపై సంతకాలు చేసినట్లు తెలిసింది.












Click it and Unblock the Notifications