ఈ నెల 28 నుంచి తెలంగాణాలో..
Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ.. ఎన్నికల ప్రచార సమయంలో వారి ఇచ్చిన ఆరు గ్యారంటీల హామీలను నెరవేర్చే దిశగా కసరత్తు మొదలుపెట్టింది. ఇప్పటికే టీఎస్ఆర్టీసీ బస్సుల్లో మహాలక్ష్మి పథకం అమల్లోకి వచ్చింది. రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద 10 లక్షల వరకు ఉచిత వైద్య సౌకర్యాన్ని ప్రవేశపెట్టింది.
మిగిలిన వాటి అమలుపై రేవంత్ రెడ్డి దృష్టి సారించారు. ఇందులో భాగంగా- జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం అయ్యారు. ఉదయం 10 గంటలకు సచివాలయంలో ఈ భేటీ ప్రారంభమైంది. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, వివిధ శాఖల మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ రవి గుప్తా పాల్గొన్నారు.

వివిధ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, విభాగాధిపతులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రజా పాలనపై ప్రకటన చేశారు. ప్రభుత్వాన్ని గ్రామ స్థాయి వరకు తీసుకెళ్లడానికి ఉద్దేశించిన ప్రజా పాలన కార్యక్రమాన్ని ఈ నెల 28వ తేదీ నుంచి ప్రారంభించనున్నట్లు తెలిపారు. జనవరి 6వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమం కొనసాగుతుంది.
ప్రతి రోజూ ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మళ్లీ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ ప్రజాపాలన గ్రామ సభలు నిర్వహిస్తామని, ఇందులో స్థానిక ప్రజా ప్రతినిధులను ఇందులో భాగస్వామ్యులను చేశామని తెలిపారు. జిల్లా, డివిజన్, మండలం, గ్రామ స్థాయిలో తీసుకెళ్లడానికి చేపట్టాల్సిన కార్యాచరణ ప్రణాళికపై ఈ సమావేశంలో రేవంత్ రెడ్డి చర్చించారు.
ఎన్నికల ఆరు గ్యారంటీల అమలులో భాగంగా 100 రోజుల ప్రణాళికను రూపొందించాలని రేవంత్ రెడ్డి.. అధికారులను ఆదేశించారు. ప్రజలు ఎదుర్కొంటోన్న సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించడానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ప్రజా పాలన సభల్లో వచ్చిన విజ్ఞప్తులన్నింటినీ డిజిటల్ రూపంలో భద్ర పర్చాలని, పరిష్కారానికి నోచుకున్న వాటిని సంబంధిత ఫిర్యాదుదారుడికి తెలియజేయాలని చెప్పారు.












Click it and Unblock the Notifications