కార్పోరేషన్లకు మేయర్ అభ్యర్థులను ఖరారు చేసిన సీఎం జగన్... ఫైనల్ జాబితా ఇదే...
ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవలి మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికలను క్లీన్ స్వీప్ చేసిన వైసీపీ... తాజాగా కార్పోరేషన్లకు మేయర్ అభ్యర్థులను ఖరారు చేసింది. మేయర్ పదవుల్లో సీఎం జగన్ మహిళలకు పెద్ద పీట వేశారు.
చిత్తూరు మేయర్‌గా ఆముద,తిరుపతి మేయర్‌గా శిరీష,అనంతపురంలో వసీమ్ సలీమ్,కడపలో సురేశ్ బాబు,కర్నూలులో రామయ్య,ఒంగోలులో సుజాత,గుంటూరులో మనోహర్ నాయుడు,విజయవాడలో భాగ్యలక్ష్మి భామన,విజయనగరంలో విజయలక్ష్మి పేర్లను ఖరారు చేశారు.విశాఖపట్నం మేయర్ పదవికి హరి వెంకట కుమారి,వంశీకృష్ణ శ్రీనివాస్ పేర్లను పరిశీలిస్తున్నారు. మచిలీపట్నం మేయర్ అభ్యర్థిని కూడా ఇంకా ఖరారు చేయాల్సి ఉంది.

ప్రతీ మున్సిపాలిటీలో ఇద్దరు వైస్ ఛైర్మన్లను, ప్రతీ కార్పొరేషన్‌లో ఇద్దరు డిప్యూటీ మేయర్లను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన ఆర్డినెన్స్‌కు బుధవారం(మార్చి 18) గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఆమోదం తెలిపారు. పదవుల కోసం పోటీపడుతున్న ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో ఎక్కువమందికి పదవులు కట్టబెట్టేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఐదుగురు నేతలకు డిప్యూటీ సీఎంలుగా అవకాశం కల్పించిన సీఎం జగన్.... మున్సిపల్,కార్పోరేషన్ పదవుల్లోనూ అదే ఫార్ములాను ఫాలో అవుతున్నారు.
కాగా,మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికలను వైసీపీ క్లీన్ స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. 11 మునిసిపల్ కార్పోరేషన్లు, 73 మున్సిపాలిటీల్లో ఆ పార్టీ విజయం సాధించింది. ప్రతిపక్ష టీడీపీ తమ రాజకీయ చరిత్రలో అతిపెద్ద అపజయాన్ని మూటగట్టుకుంది. కేవలం తాడిపత్రి,మైదుకూరు మున్సిపాలిటీలను మాత్రమే ఆ పార్టీ దక్కించుకోగలిగింది. జగన్ పాలన పట్ల ప్రజలు చూపిస్తున్న ఆదరణకు ఈ విజయం నిదర్శనమని వైసీపీ నేతలు చెప్తున్నారు.అయితే వైసీపీ దౌర్జన్యపూరితంగా వ్యవహరించడం వల్లే ఇలా ఏకపక్ష విజయం సాధ్యమైందని టీడీపీ విమర్శిస్తోంది.












Click it and Unblock the Notifications