ఏపీకి సీఎం జగన్ బ్రాండ్ అంబాసిడర్: విశాఖ ఇన్వెస్టర్స్ సమ్మిట్ చారిత్రాత్మకం!!
ఏపీకి సీఎం జగన్ బ్రాండ్ అంబాసిడర్ అంటూ విశాఖ ఇన్వెస్టర్స్ సమ్మిట్ పై మంత్రులు అమర్నాథ్, రోజా, సీదిరి అప్పలరాజు, అంబటి రాంబాబు, ఎంపీ మార్గాని భరత్ తదితరుల ప్రశంసలవెల్లువ కురుస్తుంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023 ఇప్పుడు దేశం దృష్టిని ఆకర్షిస్తుంది. దేశ విదేశాల నుంచి వస్తున్న వ్యాపార దిగ్గజాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడుల వరద కురుస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులపై, పారిశ్రామిక ప్రగతి పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన ప్రతిపక్షాల నోటికి తాళం పడేలా పెట్టుబడుల సదస్సులో అపర కుబేరులు, వ్యాపార దిగ్గజాలు, ఏపీలో పెట్టుబడులు పెట్టడంపై సంచలన ప్రకటనలు చేస్తున్నారు.

విశాఖలో విప్లవంలా పెట్టుబడులు: మంత్రి అంబటి
ఇక ఈ క్రమంలో వైసిపి మంత్రులు, ఎమ్మెల్యేలు విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ను, ను ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని ఓ రేంజ్ లో పొగుడుతున్నారు. తాజాగా ఏపీ ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు అదే విశాఖ.. అదే సమ్మిట్ .. తరలివచ్చిన వ్యాపార దిగ్గజాలు నేడు విశాఖలో విప్లవంలా పెట్టుబడులు.. అది జగన్మోహన్ రెడ్డి చిత్తశుద్ధి అంటూ జగన్మోహన్ రెడ్డి పనితీరుకు కితాబు ఇచ్చారు.

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఏపీకి బ్రాండ్ అంబాసిడర్: మంత్రి సీదిరి అప్పలరాజు
ఇక ఏపీ మంత్రి సీదిరి అప్పలరాజు విశాఖలో జరుగుతున్న గ్లోబల్ ఇన్వెస్టర్ల సమ్మిట్ కు హాజరై కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఏపీకి బ్రాండ్ అంబాసిడర్ అంటూ సీదిరి అప్పలరాజు పేర్కొన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి చరిష్మా తోనే ఏపీ గ్లోబల్ సమ్మిట్ లో భారీ పెట్టుబడులు వచ్చాయని ఆయన పేర్కొన్నారు. త్వరలో ఉత్తరాంధ్ర ముఖచిత్రం మారబోతుందని ఆయన వ్యాఖ్యలు చేశారు. భోగాపురం మీదుగా ఆరు లైన్ల హైవే ఏర్పాటు కావడం ఉత్తరాంధ్ర అభివృద్ధిలో కీలకం కాబోతుందని మంత్రి సీదిరి అప్పలరాజు అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఇన్వెస్టర్ల సమ్మిట్ చారిత్రాత్మక విజయం సాధించింది: మంత్రి అమర్నాథ్
ఇదిలా ఉంటే ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఇన్వెస్టర్ల సమ్మిట్ చారిత్రాత్మక విజయం సాధించిందని, పెట్టుబడిదారులు పెట్టుబడులు పెట్టడానికి ఏపీ పై ఆసక్తి చూపిస్తున్నారని పేర్కొన్నారు. జగన్ మాటల మనిషి కాదని.. చేతల మనిషి అని మంత్రి గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు. పలు దేశాల నుంచి వచ్చిన ప్రసిద్ధ సంస్థలు విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో పాల్గొంటున్నాయని పేర్కొన్న ఆయన రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువగా మారాయని హర్షం వ్యక్తం చేశారు.

ఇది ఆంధ్రప్రదేశ్ బ్రాండ్: మంత్రి రోజా
ఇక ఏపీ మంత్రి రోజా విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ పై తనదైన శైలిలో సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో వస్తున్న పెట్టుబడులపై ఇది ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ అంటూ రోజా పేర్కొన్నారు .20 రంగాలలో ఆరు లక్షల మందికి ఉపాధి కల్పించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ 13 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులను రికార్డు స్థాయిలో అందుకుందని రోజా పేర్కొన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రగతి పథంలో ఆంధ్రప్రదేశ్ దూసుకుపోతుందని రోజా తెలిపారు.

ఆచరణలో చూపించే సీఎం వైయస్ జగన్ : ఎంపీ మార్గాని భరత్
వైసీపీ ఎంపీ మార్గాని భరత్ విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ చారిత్రాత్మకమని కొనియాడారు. ఏ పనైనా ఆచరణలో చూపించే సీఎం వైయస్ జగన్ ఆధ్వర్యంలో ఏపీ ప్రభుత్వం నడుస్తుందని, 11.5 లక్షల కోట్ల పెట్టుబడుల ఎంవోయూలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. అడ్వాంటేజ్ ఆంధ్రప్రదేశ్ అంటూ బహుళ ఓడరేవులతో 974 కిలోమీటర్ల తీర ప్రాంతంతో, 70 శాతం నైపుణ్యం కలిగిన మానవ వనరులతో, 46000 ఎకరాల భారీ భూ వనరులతో ఏపీ ఉందని ఆయన ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు.












Click it and Unblock the Notifications