ప్రధాని మోదీకి సీఎం జగన్ లేఖ.. చైనాలో చిక్కుకుపోయిన విశాఖ వాసుల కోసం..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రి మోదీకి లేఖ రాశారు. చైనాలో చిక్కుకుపోయిన 35 మంది విశాఖ వాసులను ఇండియా తీసుకొచ్చే ఏర్పాట్లు చేయాలని కోరారు. వారంతా పానెల్ అప్టోడిస్‌ప్లే టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్(POPTL)కంపెనీకి చెందిన ఉద్యోగులుగా పేర్కొన్నారు. ట్రైనింగ్ కోసం గతేడాది అగస్టులో కంపెనీ వారిని అక్కడికి తీసుకెళ్లినట్టు చెప్పారు. కరోనా వైరస్ నేపథ్యంలో ప్రస్తుతం వారంతా అక్కడినుంచి ఇండియా తిరిగొచ్చేందుకు ప్రభుత్వ సహాయం కోరుతున్నారని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. తక్షణమే వారిని ఇండియా రప్పించేలా ఏర్పాట్లు చేయాలని విజ్ఞప్తి చేశారు.
కాగా,తిరుపతిలోని POPTL యూనిట్‌లో వీరు ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. ఎల్‌సీడీ టీవీ స్క్రీన్ మాన్యుఫాక్చర్ ట్రైనింగ్ కోసం కంపెనీ వీరిని చైనాకు పంపించింది. ఈ ఏడాది మార్చి మొదటివారంలో అక్కడ శిక్షణ ముగించుకుని తిరిగి తిరుపతి యూనిట్‌కు వచ్చి విధుల్లో చేరాల్సి ఉంది. ఇంతలో చైనాలోని వుహాన్ పట్టణం నుంచి కరోనా వైరస్ వ్యాప్తి చెందడంతో.. త్వరగా అక్కడినుంచి ఇండియా వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో బీజింగ్‌లోని భారత దౌత్య కార్యాలయానికి వారు లేఖ రాశారు. ఏపీలోని వారి తల్లిదండ్రులు కూడా విశాఖపట్నం ఎంపీ ఎంవీవీ సత్యనారాయణను కలిసి తమవారిని వెనక్కి రప్పించాల్సిందిగా కోరారు. ఈ నేపథ్యంలోనే సీఎం జగన్ ప్రధాని మోదీకి లేఖ రాశారు.

కాగా,చైనాలో కరోనా వైరస్ కారణంగా ఇప్పటివరకు 213 మంది మృతి చెందినట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అలాగే మరో 9810మందికి కరోనా సోకినట్టు నిర్దారించారు. మరో 15238 కరోనా అనుమానిత కేసులు నమోదయ్యాయి. కరోనా బారినపడివారిలో ఇప్పటివరకు 171 మంది తిరిగి కోలుకున్నట్టు చెబుతున్నారు. కరోనా వైరస్ ఇప్పటికే పలు దేశాలకు వ్యాప్తి చెందడంతో.. ప్రపంచం మొత్తాన్ని వైరస్ భయపెడుతోంది. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేంతవరకు దీన్ని అరికట్టడం సాధ్యమయ్యేలా కనిపించడం లేదు.












Click it and Unblock the Notifications