ఆ నాలుగు నియోజకవర్గాల్లో జగన్ సైలెంట్ ఆపరేషన్...!!
ఏపీలో ఎన్నికల సమరం పతాక స్థాయికి చేరింది. ప్రచారం హోరా హోరీగా సాగుతోంది. ఈ సారి గెలుపు ప్రధాన పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారుతోంది. కూటమి ముఖ్య నేతలు పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో ఎన్నికల ఫలితం పైన ఉత్కంఠ కనిపిస్తోంది. సీఎం జగన్ పార్టీలోని ముఖ్య నేతలకు కీలక నియోజకవర్గాల బాధ్యతలను అప్పగించారు. ప్రత్యేకించి నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో జగన్ సైలెంట్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. అక్కడ గ్రౌండ్ రిపోర్ట్ ఆసక్తి కరంగా మారుతోంది.
జగన్ సైలెంట్ ఆపరేషన్
ముఖ్యమంత్రి జగన్ ఈ సారి ఎన్నికల్లో కూటమి ముఖ్య నేతలు పోటీ చేస్తున్న నాలుగు నియోజకవర్గాల పైన ఫోకస్ చేసారు. చంద్రబాబు, బాలయ్య పోటీ చేస్తున్న కుప్పం..హిందూపురం బాధ్యతలను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కేటాయించారు. పవన్ పోటీ చేస్తున్న పిఠాపురంలో వ్యవహారాలను మిథున్ రెడ్డి పర్యవేక్షిస్తున్నారు. లోకేష్ పోటీ చేస్తున్న మంగళగిరిలో పార్టీ గెలుపును ఆర్కే ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. ప్రస్తుతం ప్రచారం తీరు తెన్నులు..మేనిఫెస్టో తరువాత క్షేత్ర స్థాయి పరిస్థితుల..మిగిలిన పది రోజుల కార్యాచరణ పై పార్టీ ముఖ్య నేతలతో జగన్ సమీక్షిస్తున్నారు. అందులో భాగంగా ఈ నాలుగు నియోజకవర్గాల్లో జగన్ ప్రచార సభల పైన షెడ్యూల్ ఖరారు చేయనున్నారు.

హిందూపురంలో ప్రచారం
కుప్పంలో చంద్రబాబు ఓడిపోతారంటూ చాలా రోజులుగా వైసీపీ ముఖ్య నేతలు ప్రచారం చేస్తున్నారు. జగన్ సైతం కుప్పంతో సహా వై నాట్ 175 అంటూ నినదిస్తున్నారు. అక్కడ భరత్ ను అభ్యర్దిగా ప్రకటించి ప్రతీ ఇంటికి చేరువయ్యేలా ప్రణాళికలు అమలు చేసారు. అయితే, చంద్రబాబు సైతం కుప్పంలో కౌంటర్ స్ట్రాటజీ అమలు చేస్తున్నారు. మంత్రి పెద్దిరెడ్డి తన నియోజకవర్గం కంటే కుప్పం పైనే ఎక్కువగా కసరత్తు చేస్తున్నారు. అదే విధంగా హిందూపురం నుంచి బాలయ్య మీద దీపికను బరిలోకి దింపారు. ఈ నెల 4న హిందూపురంలో జగన్ రోడ్ షో ఏర్పాటు చేసారు. అక్కడ సామాజిక వర్గాల సమీకరణాలే ఈ సారి గెలుపులో కీలకం కానున్నాయి. టీడీపీకి కంచుకోటగా ఉన్న హిందూపురంతో పాటుగా కుప్పంలో పార్టీ గెలుపు పెద్దిరెడ్డికి సవాల్ గా మారుతున్నాయి.
నాలుగు నియోజకవర్గాలపై గురి
ఇక..పవన్ పోటీ చేస్తున్న పిఠాపురం వైపు అందరి చూపు నెలకొంది. అక్కడ వైసీపీ నుంచి వంగా గీత పోటీ చేస్తున్నారు. ఈ సారి గెలుపు పవన్ కు ప్రతిష్ఠాత్మకంగా మారింది. వర్మ పైన భారం పెట్టారు. వైసీపీ సైలెంట్ ఆపరేషన్ కొనసాగుతోంది. సామాజిక సమీకరణాలను పక్కగా అమలు చేసేలా ప్రణాళికలు సిద్దం చేసారు. మంగళగిరిలో లోకేష్ పోటీ చేస్తున్నారు. అక్కడ స్థానికత, బీసీ సీటు నినాదంతో పాటుగా స్థానికంగా సామాజిక లెక్కల ఆధారంగా వైసీపీ ముందుకు వెళ్తోంది. మంగళగిరి, పిఠాపురంలో ప్రచారం ముగింపు చివరి రెండు రోజుల్లో జగన్ సభలు ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ నియోజకవర్గాలకు సంబంధించి జగన్ ఎలక్షనీరింగ్ పైన పార్టీ ముఖ్య నేతలకు దిశా నిర్దేశం చేస్తున్నారు. దీంతో..ఈ నియోజకవర్గాల్లో ఫలితం పైన ఆసక్తి పెరుగుతోంది.












Click it and Unblock the Notifications