ఈ రాత్రికే ఢిల్లీకి జగన్- విమానంలో సాంకేతిక లోపాలపై సమగ్ర విచారణ..!!
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటనలో స్వల్పంగా మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ సాయంత్రం ఢిల్లీకి బయలుదేరి వెళ్లాల్సి ఉన్నప్పటికీ- ఫ్లైట్ లో సాంకేతిక లోపాల వల్ల వెనక్కి తిరిగి వచ్చారు.
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ఢిల్లీ పర్యటనలో స్వల్పంగా మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ రాత్రి 9 గంటలకు ఆయన ఢిల్లీకి బయలుదేరి వెళ్తారు. 10:55 నిమిషాలకు ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటారు. తన ఢిల్లీ పర్యటన సందర్భంగా ఆయన నంబర్ 1, జన్‌పథ్ లో బస చేస్తారు. ఈ మేరకు షెడ్యూల్ ఖరారైంది. ప్రాధాన్యత ఉన్న సదస్సు కావడం వల్ల ఆలస్యం చేయకూడదనే ఉద్దేశంతో రాత్రే బయలుదేరి వెళ్లనున్నారు.
తొలుత మంగళవారం తెల్లవారు జామున బయలుదేరాలని భావించినప్పటికీ- అత్యవసర సమావేశాలు ఉండటం వల్ల రాత్రే వెళ్లాలని నిర్ణయించుకున్నారు. రేపు ఉదయం ఢిల్లీలో ఏర్పాటైన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కు హాజరు కావాల్సి ఉంది. హోటల్ లీలా ప్యాలెస్ లో ఈ సమ్మిట్ ఏర్పాటైంది. రెండు రోజుల పాటు ఆయన ఢిల్లీలో గడుపుతారు. మార్చి 3, 4 తేదీల్లో విశాఖపట్నంలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సును ఏర్పాటు చేసినందున.. దీనికి సన్నాహకంగా దీన్ని నిర్వహిస్తోంది ప్రభుత్వం.

ఈ సదస్సులో పాల్గొనడానికి జాతీయ, అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులను ఆహ్వానిస్తోంది ప్రభుత్వం. ఇందులో భాగంగా వివిధ దేశాల రాయబారులతో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో పాల్గొంటారు. ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి గల అవకాశాలు, ప్రభుత్వం అనుసరిస్తోన్న పారిశ్రామిక విధానాల గురించి వివరిస్తారు. రెండో రోజు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షానూ కలుస్తారు.
నిజానికి- వైఎస్ జగన్ ఈ సాయంత్రమే ఢిల్లీకి బయలుదేరి వెళ్లినప్పటికీ.. అత్యవసరంగా వెనక్కి రావాల్సి వచ్చింది. ఆయన ప్రయాణిస్తోన్న ప్రత్యేక విమానంలో సాంకేతిక లోపాలు తలెత్తాయి. దీనితో మళ్లీ తిరిగి రావాల్సి వచ్చింది. గన్నవరం ఎయిర్ పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. సాయంత్రం 5:03 ప్రత్యేక విమానం గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి టేకాఫ్ తీసుకుంది.

కొద్దిసేపటికే అందులో సాంకేతిక లోపాలను గుర్తించారు పైలెట్. ఫ్లైట్ ను వెనక్కి మళ్లించారు. రాత్రి 9 గంటలకు జగన్ మరో విమానంలో ఢిల్లీకి బయలుదేరి వెళ్తారు. కాగా- ఈ విమానంలో తలెత్తిన సాంకేతిక లోపాలను ఏపీ ప్రభుత్వం తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంది. దీనిపై సమగ్ర విచారణకు ఆదేశించింది. ఎమర్జెన్సీ ల్యాండింగ్ కు కారణమైన సాంకేతిక లోపం ఏమిటనే విషయంపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఆ ఫ్లైట్ ఇంజిన్ డయాగ్రం, బ్లూప్రింట్, ఇతర అంశాలపై అధికారులు విచారణ జరుపుతున్నారు.












Click it and Unblock the Notifications