సంక్రాంతి సందడి: కోళ్ల పందేల జోరు, పోలీసు దాడులు

పశ్చిమ గోదావరి జిల్లాలో సంక్రాంతి సందర్భంగా కోడిపందాల ఆటకట్టేందుకు పోలీసులు రంగం సిద్దం చేశారు. ఈ సందర్భంగా జిల్లాలోని పలుచోట్ల తనిఖీలు నిర్వహించారు. పెదపాడు మండలం కలపర్రులో పోలీసుల తనిఖీల్లో కోడిపందాలు ఆడటానికి వెళ్తున్న ఏడుగురిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 3.32 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.
సంక్రాంతి పర్వదినం సందర్భంగా ఉభయ గోదావరి జిల్లాల్లో కోడి పందేలు జోరుగా సాగుతున్నాయి. ఈ పందేలకు పెద్ద యెత్తున రాజకీయ, సినీ ప్రముఖులు తరలి వచ్చారు. కోడి పందేలపై నిషేధం ఉన్నప్పటికీ వాటి జోరు తగ్గడం లేదు. కోస్తాలోని కొన్ని జిల్లాల్లో ఆరు నెలలకు ముందే లాడ్జీలు మొత్తం బుక్కయ్యాయి. సంక్రాంతి సందర్భంగా కోడి పందేలు కాయడం సంప్రదాయంగా వస్తోంది. కోడి పందేలు కాసే వారికి పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చినా ఫలితం కనిపించడం లేదు.
పందేలకు కోడి పుంజులను ప్రత్యేకంగా పెంచేవారు జిల్లాల్లో ఉన్నారు. వాటికి వారు ప్రత్యేకంగా ఆహారం ఇస్తారు. ఒక్కో పుంజు 15 నుంచి 20 వేల వరకు పలుకుతుందని గుంటూరు జిల్లాలోని ఓ పెంపకందారు చెప్పారు. తమ వద్ద నుంచి కోడి పుంజులను కొనుక్కుని వెళ్లి పందేల కోసం వాటికి శిక్షణ ఇస్తారని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications