జిల్లా నుంచి TDP నేతను బహిష్కరించిన కలెక్టర్!
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి చెందిన కీలక నేత మద్దిరెడ్డి కొండ్రెడ్డిని 6 నెలలపాటు జిల్లానుంచి బహిష్కరించారు. ఈ మేరకు కలెక్టర్ గిరీష ఉత్తర్వులు జారీచేశారు. తంబళ్లపల్లె నియోజకవర్గానికి చెందిన కొండ్రెడ్డి కురబలకోటలో పార్టీ కార్యకర్తలను పరామర్శించడానికి వెళ్లగా పోలీసులు కేసు నమోదు చేశారు. కేసులో కొండ్రెడ్డి అరెస్టవడంతోపాటు కలెక్టర్ షోకాజ్ నోటీసు జారీచేశారు.
జిల్లా ఎస్పీ ఇచ్చిన నివేదిక ప్రకారం మద్దిరెడ్డి తరుచుగా వివాదాలకు దిగుతుంటారని, నేరస్తుడిగా గుర్తించామని, ప్రమాదకర కార్యకలాపాల నిరోధక చట్టం 1980 సెక్షన్ 2(1) కింద అతన్ని గూండాగా పరిగణించవచ్చని నోటీసుల్లో పేర్కొన్నారు. అంతేకాకుండా అతనిపై గతంలో నమోదైన కేసులను కూడా ప్రస్తావించారు. దీనిపై డిసెంబరు 27వ తేదీన రాయచోటి కలెక్టర్ ఎదుట హాజరైన కొండ్రెడ్డి వివరణ ఇచ్చారు. తర్వాత అతన్ని కడప సెంట్రల్ జైలుకు తరలించారు. బెయిల్ లభించడంతో జైలు నుంచి విడుదలయ్యారు. విడుదలైన వెంటనే జిల్లా కలెక్టర్ బహిష్కరణ ఉత్తర్వులు జారీచేశారు. 6 నెలలపాటు జిల్లా వదిలి వెళ్లాలని ఆదేశించారు. 15 రోజుల్లోగా ట్రైబ్యునల్‌లో అప్పీలు చేసుకునే అవకాశం ఇచ్చారు..

మద్దిరెడ్డి కొండ్రెడ్డి మాజీ నక్సలైట్. వైసీపీలో చేరి తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి గెలుపు కోసం పనిచేశారు. ఆయన భార్య గీత వైసీపీ తరపున తంబళ్లపల్లె జెడ్పీటీసీ సభ్యురాలిగా గెలుపొందారు. అయితే పార్టీలోనే ఉంటూ కొద్ది నెలల క్రితం ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా చేసిన కామెంట్స్ నియోజకవర్గంలో హాట్ టాపిక్ అయ్యాయి. పోలీసులు మళ్లీ అరెస్ట్ చేయడంతో ఆయన తెలుగుదేశం పార్టీలో చేరారు. చేరిన వెంటనే జిల్లా నుంచి బహిష్కరించారు.












Click it and Unblock the Notifications