బాబు ఇచ్చిన చిట్టా ఇదీ! త్వరలో ఏపీలో మోడీ 'ప్యాకేజీ' (పిక్చర్స్)
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం చేతులెత్తేసింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం నాడు ఢిల్లీలో ప్రధాని మోడీ, పలువురు కేంద్రమంత్రులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన పలు విజ్ఞప్తులు చేశారు. హోదా విషయంలో మాత్రం కేంద్రం షాకిచ్చింది.
ప్రధానికి మోడీ పలు అంశాలపై విజ్ఞప్తి చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని, లేదంటే తీవ్ర అన్యాయం జరుగుతుందని విజ్ఞప్తి చేశారు. కేంద్రం ఆర్థిక లోటును పూడ్చాలని కోరారు. ఇప్పటి వరకు ఈ ఏడాదికి కేంద్రం రూ.2,300 కోట్లు ఇచ్చిందని, ప్రస్తు లోటు పూడ్చేందుకు రూ.12,109 కోట్లు కావాలన్నారు.
ఏపీలో 7 వెనుకబడిన జిల్లాలు ఉన్నాయని, వీటికి ఆర్థిక సాయం చేయాలని ప్రధాని మోడీని సీఎం చంద్రబాబు కోరారు. రాయలసీమ, ఉత్తరాంధ్రకు సహాయం చేయాలన్నారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణానికి సాయం చేస్తామని చట్టంలో చెప్పారని, అది నెరవేర్చాలని కోరారు.
ఇప్పటి వరకు రూ.1,500 కోట్లు వచ్చాయని, ప్రభుత్వ భవనాలు, ఇతర మౌలిక సదుపాయాలకు రానున్న ఐదేళ్లలో రూ.42,935 కోట్లు అవసరమవుతాయని చెప్పారు. రాయలసీమకు రోడ్లు కనెక్టివిటీ అవసరమని, విశాఖ, విజయవాడ మధ్య హైస్పీడ్ ట్రెయిన్ ఏర్పాటు చేయాలన్నారు.
విజయవాడలో మెట్రో రైళ్లు అవసరమని, పారిశ్రామికంగా అభివృద్ధి కావాలని, ఇందుకు పన్ను రాయితీలు కల్పించాలని కోరారు. షెడ్యూల్ 8 సంస్థల అభివృద్ధి, శిక్షణ, పరిశోధన సంస్థల ఏర్పాటు, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, సామాజిక, ఆర్థిక అభివృద్ధికి సాయంతో పాటు విభజన సమస్యల పరిష్కారానికి హైపవర్ కమిటీ వేయాలన్నారు.

ప్రధాని మోడీతో ఏపీ సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా స్థానంలో ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించేందుకు అవగాహన కుదిరింది. ప్రధాని మోడీ వచ్చే నెలలో తిరుపతికి వచ్చినప్పుడుగానీ లేదా ఆ తర్వాత మరో సందర్భంలో రాష్ట్రానికి వచ్చినప్పుడుగానీ ప్యాకేజీని ప్రకటించనున్నారు.

ప్రధాని మోడీతో ఏపీ సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్‌కు ఇవ్వవలసిన రాయితీలు, ఆర్థిక సహాయంపై నీతి ఆయోగ్ ఒక రోడ్ మ్యాప్‌ను సిద్ధం చేస్తుంది. ఈ రోడ్ మ్యాప్ ఆధారంగా రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీని ప్రధాని నిర్ధారించి ప్రకటిస్తారు. ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లి మంగళవారం ప్రధానమంత్రి కార్యాలయంలో గంటకు పైగా జరిగిన సమావేశంలో ఈ అవగాహన కుదిరింది.

ప్రధాని మోడీతో ఏపీ సీఎం చంద్రబాబు
ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వలేని పక్షంలో తెలంగాణ, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాలస్థాయికి ఆంధ్రప్రదేశ్ ఎదిగేందుకు వీలుగా కేంద్రం ఆర్థిక సహాయం, పారిశ్రామిక సహాయం చేయాలంటూ చంద్రబాబు చేసిన ప్రతిపాదనను మోడీఆమోదించారు. పద్నాల్గవ ఆర్థిక సంఘం సిఫారసుల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వటం సాధ్యం కాదని కేంద్రం స్పష్టం చేసింది.

ప్రధాని మోడీతో ఏపీ సీఎం చంద్రబాబు
హోదా స్థానంలో రాష్ట్రానికి మంచి ప్యాకేజీ ఇస్తామని మోడీ హామీ ఇచ్చారు. ఈ సమావేశానికి నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు అరవింద్ పనగరియా, ప్రధాని కార్యాలయం ప్రిన్సిపల్ కార్యదర్శి నృపేంద్ర మిశ్రా, కేంద్ర ఆర్థిక శాఖ వ్యయ నిర్వహణ కార్యదర్శి వట్టల్, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి సతీష్‌చంద్ర, ఆర్థిక శాఖ కార్యదర్శి పివి రమేష్ కూడా హాజరయ్యారు.












Click it and Unblock the Notifications