హైదరాబాద్‌పై ఘాటు వ్యాఖ్య: చంద్రబాబుపై పోలీసులకు ఫిర్యాదు
హైదరాబాద్: తెలుగుదేశం అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన తెలంగాణ న్యాయవాదులు బుధవారం నాడు సైఫాబాద్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. హైదరాబాదు పైన అనుచిత వ్యాఖ్యలు చేశారని, తద్వారా తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీశారని వారు అందులో పేర్కొన్నారు. చంద్రబాబు తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
హైదరాబాద్‌లో ఉండి ఆంధ్రప్రదేశ్‌ను పరిపాలించడం విదేశాల్లో ఉండి పాలన సాగిస్తున్నట్లు ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెళ్లిపోవాలని, ఈ విషయంలో ప్రభుత్వం పట్టుదలగా ఉందని ఉద్యోగ సంఘాల నేతలకు స్ప ష్టం చేశారు.

హైదరాబాద్‌లో కూర్చుని పరిపాలన సాగించడం తనకు ఏ మాత్రం బాగా లేదని,ఇక్కడ ఉండి పాలన సాగిస్తే ప్రజలు ఇబ్బందులు పడతారని, అది సరికాదని, మనం వెళ్లిపోవాలని, అది తప్పదని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి పాలన సాగించడానికి మీరంతా నాకు సహకరించాలని ముఖ్యమంత్రి ఉద్యోగ సంఘాల నాయకులకు విజ్ఞప్తి చేశారు.
ఆంధ్రప్రదేశ్ నుంచే పాలన సాగించే విషయమై ప్రభుత్వం చాలా పట్టుదలగా ఉందని, ఉద్యోగులు కూడా ఇందుకు సహకరించాలని స్పష్టం చేశారు. ఏపీ ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు అశోక్‌బాబు, వెంకటేశ్వరరావు, బొప్పరాజు వెంకటేశ్వర్లు, కత్తి నరసింహారెడ్డి తదితరులు మంగళవారం రాత్రి సచివాలయంలో సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు.
చంద్రబాబు వ్యాఖ్యల పైన తెలంగాణ రాష్ట్ర నేతలు మండిపడుతున్నారు. నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ఏపీ సీఎం పైన దుమ్మెత్తి పోశారు. తెలంగాణ ప్రభుత్వ పాలన పైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజలు సుఖంగా ఉండటం చూసి ఓర్వలేకనే విదేశాల నుండి పాలన చేస్తున్నట్లుందని చెప్పాడని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణలో ఆంధ్రా పార్టీలు అవసరం లేదన్నారు. విదేశాల్లో ఉన్నట్లు భావిస్తే చంద్రబాబు వెంటనే ఆంధ్రాకు వెళ్లి పోవాలన్నారు. లేకుంటే తెలంగాణ ప్రజలు సహించరన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో చంద్రబాబు ఎన్ని కుట్రలు చేశారో అందరికీ తెలుసునని, తమకు ఆంధ్రా పార్టీలు వద్దన్నారు.












Click it and Unblock the Notifications