చంద్రబాబు సంజాయిషీ?: రాజధాని డిజైన్స్ మరింత ఆలస్యం, ఓటమి తప్పదా?
విజయవాడ: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలకు ప్రతిసారీ చెప్తున్న మాట సన్ రైజ్ స్టేట్‌గా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ప్రపంచంలోనే అత్యంత సాంకేతిక విలువలతో కూడిన రాజధానిగా నిర్మిస్తామని నొక్కి మరీ చెబుతున్నారు. ఈ మాటలన్నీ ప్రజలను మభ్యపెట్టే విధంగానే ఉన్నాయో తప్ప అమరావతి నిర్మాణ పనులు మొదలవడానికి ఇంకా ఎన్నేళ్లు పడతాయో కూడా తెలియని పరిస్థితి.
అయితే రాజధాని విషయంలో మీడియాలో రోజుకో కొత్త కథ వినిపిస్తోంది. తాజాగా రాజధానిలో భవనాలకు డిజైన్ అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసిన జపాన్‌కి చెందిన మాకి అండ్ అసోసియేట్స్ సంస్థ రూపొందించిన డిజైన్లు విద్యుత్ ప్లాంట్ చిమ్నీలలాగ ఉన్నాయని విమర్శలు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచనలో పడింది.

నిజానికి ఏపీ రాజధాని డిజైన్లను రూపొందించడంలో మూడు సంస్ధలు పోటీ పడ్డాయి. ఈ మూడు సంస్ధలు సమర్పించిన రాజధాని భవనాల డిజైన్లను ఆరుగురుతో కూడిన బృందం క్షుణ్ణంగా పరిశీలించిన తరువాతనే జపాన్ సంస్థ మాకి అండ్ అసోసియేట్స్ సంస్థ రూపొందించిన డిజైన్‌ను ఖరారు చేసింది.
అయితే ఇప్పుడు మాకి సంస్థ సమర్పించిన డిజైన్లపై విమర్శలు రావడంతో ఆ డిజైన్లు బాగోలేదని, వాటిని మార్చి మళ్ళీ కొత్త డిజైన్లు సమర్పించాలని ప్రభుత్వం కోరుతోంది. దీంతో పాటు డిజైన్ల రూపొందించేందుకు గాను మాకి సంస్థ కోట్ చేసిన రూ.89 కోట్లు ఫీజుని కూడా తగ్గించాలని ప్రభుత్వం ఒత్తిడి చేస్తోంది.
అమరావతిలో నిర్మించబోయే రాష్ట్ర శాసనసభ, హైకోర్టు, సచివాలయం, రాజ్ భవన్, ముఖ్యమంత్రి, మంత్రుల కార్యాలయాలు అన్నీ కూడా తెలుగు సంస్కృతిని ప్రతిబింబించే విధంగా ఉంటూనే అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్లుగా ఉండాలని ప్రభుత్వం భావించింది.
అయితే మాకి సంస్ధ జపాన్‌కి చెందినది కావడంతో వారికి తెలుగు సంస్కృతి తెలియదు కాబట్టి ఆ భవనాలను ఏ విధంగా డిజైన్ చేయాలో సూచించేందుకు మన దేశానికి చెందిన ఎనిమిది మంది అర్కిటెక్చర్ నిపుణులతో కూడిన ఒక బృందాన్ని సీఆర్డీఏలో ఏర్పాటు చేసింది.

వారి సలహాలు, సూచనల మేరకు మాకి సంస్థ రాజధాని భవనాలను డిజైన్ చేయాలని ప్రభుత్వం ఆశిస్తోంది. సోమవారం తన నివాసం నుంచి క్యాపిటల్ సిటీ ఆర్కిటెక్చర్ అడ్వైజర్ కమిటీతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో అమరావతిలో ప్రభుత్వ భవనాల సముదాయాలకు సంబంధించి ఆకృతిలో మార్పులు చేసి తుదిరూపు తీసుకురావాలని ఆయన సూచించారు.
మళ్లీ వారితో మే 9న సమావేశం కాబోతున్నారు. వారితో చర్చించిన తర్వాతే ఆయన మాకి సంస్థ ప్రతినిధులతో సమావేశమై దీని గురించి చర్చిస్తారు. ఒకవేళ మాకి సంస్థ ఆయన సూచనలకు అంగీకరిస్తే సరే సరి లేకుంటే దానిని పక్కన పెట్టి వేరొక సంస్థని ఆహ్వానించే అవకాశం ఉందని సమాచారం.
మాకి సంస్ధ ఇచ్చిన డిజైన్లు మొదట్లో సూపర్ డూపర్‌గా ఉన్నాయని మెచ్చుకున్న చంద్రబాబు, ఆ తర్వాత విమర్శలు రావడంతో దాని దిద్దుబాటు చర్యలు చేపట్టినట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా ఈ ఏడాది అక్టోబర్ నాటికి ఏదో ఒక సంస్థ ద్వారా రాజధాని భవనాల డిజైన్లను ఓకే చేయాలని ముఖ్యమంత్రి ఉన్నట్లు తెలుస్తోంది.
రాజధాని అంతర్జాతీయ స్థాయిలో ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరుకొన్నారు కాబట్టే సింగపూర్ సంస్థ చేత మాష్టర్ ప్లాన్ గీయించారని టీడీపీ నేతలు అంటున్నారు. అయితే పరిపాలనా భవనాల సముదాయం తెలుగు సంస్కృతిని ప్రతిబింబించే విధంగా డిజైన్లను సూచించేందుకు మన దేశానికే చెందిన 8మంది ప్రముఖ అర్కిటెక్చర్ నిపుణులకి బాధ్యత అప్పజెప్పినప్పుడు, మళ్ళీ అదే పనిని మాకి సంస్థకి అప్పజెప్పడం ఎందుకు చెప్పారో అర్ధం కావడం లేదు. తెలుగు సంస్కృతి సాంప్రదాయాల పైన బొత్తిగా అవగాహన లేని జపాన్ సంస్థకి అప్పగించడం వల్లే ఇటువంటి విమర్శలు, ఊహించని సమస్యలు ఎదురయ్యాయి.
దీని వల్ల రాజధాని అమరావతి నిర్మాణం ఇంకా ఆలస్యం అయ్యే ప్రమాదం ఉంది. ఇదే గనుక జరిగితే వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ఓటమి తప్పదు. రాజధాని విషమయై ప్రజలకు చంద్రబాబు సంజాయిషీ చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి సాధ్యమైనంత త్వరగా రాజధాని భవనాలను నిర్మాణాన్ని ప్రారంభిస్తే అది ప్రభుత్వానికే మంచిది.
మరోవైపు రాజధాని నిర్మాణంలో అత్యుత్తమ ఆర్కిటెక్ట్‌ను ఎంపిక చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టిందని ముఖ్యమంత్రి వెల్లడించారు. సోమవారం ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ఇప్పటివరకూ రాజధాని అమరావతికోసం చేసిన పని అంతా ఒక ఎత్తు, ఇకముందు జరిగేది మరో ఎత్తు అని అన్నారు.
అత్యుత్తమ రాజధానిని నిర్మించేందుకు ప్రపంచం మెచ్చే డిజైన్లను తయారుచేసే ఆర్కిటెక్ట్‌లను ఎంపిక చేసే పనిలో నిమగ్నమయ్యామని చెప్పారు. ఈ డిజైన్లను మన దేశానికే చెందిన 8మంది ప్రముఖ అర్కిటెక్చర్ నిపుణులతో కూడిన జ్యూరీ ఎంపిక చేస్తుందన్నారు.












Click it and Unblock the Notifications