సొంత చెల్లి, తల్లిపై పోస్టులు పెట్టినా- జగన్ పై కేవీపీ సంచలనం-తొలిసారి వైఎస్ ఆత్మ..!
ఏపీలో మాజీ సీఎం వైఎస్సార్ ఆత్మగా చెప్పుకునే కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు.. ఆయన మరణం తర్వాత సైలెంట్ అయ్యారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్ధితి కూడా దారుణంగా ఉండటంతో అప్పుడప్పుడూ ఉనికి చాటుకుంటున్న ఆయన.. వైఎస్ కుమారుడైన జగన్ పై మాత్రం ఎప్పుడూ నేరుగా విమర్శలకు దిగలేదు. కానీ ఇవాళ ఆయన సీఎం జగన్ ను నేరుగా టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తల్లీ, చెల్లిని కాపాడుకోలేని అసమర్ధుడంటూ విమర్శించారు.
ఇవాళ ప్రధాని మోడీ దర్శనం దొరికినందుకు సీఎం జగన్ ను అభినందించాలంటూ కేవీపీ రామచంద్రరావు వ్యంగాస్త్రం సంధించారు. ఇతర రాష్ట్రాల కంటే ఎక్కువ సార్లు ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి జగనే అన్నారు. ఇసుక, మద్యం కుంభకోణం లో దేశంలో చాలా మంది నేతలు అరెస్టు అయ్యారు కానీ ఏపీలోని నేతలకు మాత్రం మినహాయింపు ఇచ్చారంటూ కేవీపీ ఆక్షేపించారు. బీజేపీ దృష్టిలో దేశంలో ఎలాంటి మరక లేని ప్రభుత్వం ఏపీ ఒక్కటే అనుకుంటా అన్నారు.

ఏపీలోని ఏ మంత్రి పైనా, ఎంపీలపైనా కేసులు, అరెస్టులు ఎందుకు లేవో బీజేపీ చెప్పాలని కేవీపీ కోరారు. దేశం అంతా నగదు రహిత లావాదేవీలు ఉన్నా ఏపీ లో మాత్రం అంతా నగదుతోనే విక్రయాలు జరిగినా కేంద్రం పట్టించుకోదన్నారు. వైఎస్ బొమ్మ పెట్టుకుని ఓట్లు అడగడానికి వెళ్తున్న వైసిపి నేతలకు సిగ్గు లేదన్నారు. పోలవరం పై రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఏమిటో తెలియటం లేదన్నారు. పోలవరం విషయంలో ఏపీ భావితరాలు జగన్ ప్రభుత్వాన్ని, గత టీడీపీ ప్రభుత్వాన్ని క్షమించవన్నారు.
పోలవరం పూర్తి అయితే చాలా ఎత్తిపోతల పథకాలు నిర్మించుకునే వీలుందన్నారు.
వైసీపీ ప్రభుత్వం పోలవరాన్ని ఏటీఎంల వాడుకుంటోందని కేంద్రంలోని ఉన్నత స్ధాయిలో ఉన్న వ్యక్తి తనతో చెప్పినట్లు కేవీపీ వెల్లడించారు. అది బ్యారేజి లా మిగిలిపోకూడదని కేవీపీ కోరారు. ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి జగన్ కేంద్రం నుంచి ఏం సాధించుకునీ వచ్చారో తెలియదన్నారు. పాత అంశాలనే చెప్పి మళ్ళీ ఏపీ ప్రజలను మభ్య పెడతారన్నారు. సొంత చెల్లెలు , తల్లి పై అసభ్య పదజాలంతో పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకొని అసమర్థ ప్రభుత్వం ఏపిలో ఉందన్నారు. ప్రభుత్వాధినేత గా ఏపీ లో కేసులు పెడితే తీసుకోరని, పొరుగు రాష్ట్రంలో కేసులు పెడితే సహకరించరన్నారు.
ప్రధాని మోదీ, బీజేపీ ఏపీ ప్రజలను నిట్టనిలువునా మోసం చేశారని కేవీపీ విమర్శించారు. 2014 లో మోదీ తిరుపతి ఎన్నికల ప్రచార సభలో, పార్లమెంటు లోనూ చెప్పిన ప్రత్యేక హోదా ఏమైందో తెలియదన్నారు. రాజధాని అమరావతి నిర్మాణ సమయంలో మోదీ కలుషిత మట్టి, కలుషిత జలాలు తెచ్చి ఏపీ నోట్లో మట్టి కొట్టారన్నారు. చంద్రబాబు పార్టీల పొత్తులు మార్చడం లో నితీష్ కుమార్ ను మించి పోయారన్నారు.
అమిత్ షా పైనా, రాహుల్ గాంధీ పైనా రాళ్ళు వేయించిన ఘనత ఆయనదే అన్నారు. నిన్న అమిత్ షా, జేపీ నడ్డాను కలిసి ఏం చర్చించారని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా, పోలవరం, అమరావతి గురించిన హామీలు ఏమైనా ఇచ్చారా అనేది ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. 2019 నుంచి 2024 వరకూ బిజెపి ఏపీ కి ఏం మేలు చేసిందని కేవీపీ అడిగారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేది కాంగ్రెస్ పార్టీ ఒక్కటే అన్నారు.












Click it and Unblock the Notifications