ఏపీకి హోదా లేనట్లే: పారిపోవడం లేదన్న వెంకయ్య, కాంగ్రెస్ వాకౌట్

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: ఏపీకి ప్రత్యేకహోదా విషయంలో నిబంధనలను సాకుగా చూపి ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా ఇవ్వలేమని రాజ్యసభలో కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ తేల్చి చెప్పారు. దేశంలో ఎన్నో రాష్ట్రాలు వెనుకబడి ఉన్నాయని, ఆర్ధిక సంఘన సూచించిన విధంగా, విభజన చట్టంలోని అంశాల ప్రకారమే ముందుకు సాగుతామని శుక్రవారం సభలో తేల్చి చెప్పారు.

దీంతో ఏపీకి ప్రత్యేకహోదా రాదని తెలిసిపోయింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 280లో వెల్లడించిన విధంగా మాత్రమే తాము పాలన సాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. వాజపేయి హయాంలో ఏర్పడిన రాష్ట్రాల్లో ఉత్తరాఖండ్‌కు మాత్రమే ప్రత్యేక హోదాను ఇచ్చామని, అది కూడా ఎన్డీసీ సూచిస్తేనే ఇచ్చామని గుర్తు చేశారు.

Congress members walkout in Rajya Sabha

ఇక ఈశాన్య రాష్ట్రాల్లో అభివృద్ధి తక్కువగా ఉంటుంది కాబట్టే ఆయ రాష్ట్రాలకు హోదా అమలవుతోందని ఆయన స్పష్టం చేశారు. ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తే ఒడిశా వంటి ఎన్నో రాష్ట్రాలు ప్రత్యేక హోదా కోసం పట్టుబడతాయని తెలిపారు. ఏపీకి ప్రత్యేకహోదా కల్పించే విషయమై ఎన్నో అంశాలను పరిశీలించాల్సి ఉందని చెప్పారు.

కేవలం నిరసనల కారణంగా ఏపీకి ప్రత్యేక హోదాను ఇవ్వలేమని ఆయన పేర్కొన్నారు. జైట్లీ సమాధానంతో రాజ్యసభలో ఒక్కసారిగా గందరగోళం ఏర్పడింది. జైట్లీ సమాధానంపై రాజ్యసభలోని కాంగ్రెస్ సభ్యులు అసంతృప్తి చెందారు. ఏపీకి ప్రత్యేకహోదాపై బీజేపీ వైఖరికి నిరసనగా కాంగ్రెస్ సభ్యులు వాకౌట్ చేశారు.

ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తున్నారా.. పారిపోతున్నారా..? అని రాజ్య‌స‌భ‌లో అన‌డం భావ్యం కాద‌ని కేంద్ర మంత్రి వెంక‌య్య‌నాయుడు అన్నారు. శుక్రవారం రాజ్య‌స‌భ‌లో ఏపీకి ప్రత్యేక హోదాపై చ‌ర్చ సంద‌ర్భంగా మాట్లాడిన ఆయ‌న ఏపీ సంక్లిష్ట స‌మ‌స్య‌ను ఎదుర్కుంటోంద‌ని, ఆ రాష్ట్ర స‌మ‌స్య‌ల‌ను తీర్చే అంశాల‌పై మ‌న‌మంతా దృష్టి సారించాల‌ని స‌భ్యుల‌నుద్దేశించి అన్నారు.

ఏచూరి అడిగిన ప్ర‌తి ప్రశ్న‌కు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ నుంచి స‌మాధానం వ‌చ్చింద‌ని ఆయ‌న పేర్కొన్నారు. ఏపీకి చేయాల్సిందంతా చేస్తామని స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టు ఎవరూ పారిపోవడం లేదని ఆయన పేర్కొన్నారు. కేవీపీ ప్రవేశపెట్టిన బిల్లు మళ్లీ ఆగస్టు 5న చర్చకు రానుంది. ఆరోజు బిల్లుపై కాంగ్రెస్ సభ్యులు ఓటింగ్ కోరే అవకాశం ఉంది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Congress members walkout in Rajya Sabha.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X