బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం: ఏపీలో ఫ్లాష్ ఫ్లడ్స్ కు ఛాన్స్- కంట్రోల్ రూమ్ ఏర్పాటు
Bay of Bengal: బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావం వల్ల ఏపీలో భారీ వర్షాలు కురుస్తోన్నాయి. ఉత్తరాంధ్ర సహా, ఏపీ దక్షిణ తీర ప్రాంత జిల్లాలు, రాయలసీమలో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షపాతం నమోదవుతోంది. ఇదే పరిస్థితి మరో మూడు రోజుల పాటు కొనసాగే అవకాశాలు ఉన్నాయి.
ఈ అల్పపీడనం మరింత బలపడింది. వాయుగుండంగా రూపాంతరం చెందింది. ప్రస్తుతం బంగాళాఖాతం ఉత్తరప్రాంతంలో కేంద్రీకృతమై ఉంది. వచ్చే 24 గంటల్లో ఇది వాయవ్య దిశగా కదులుతుందని, మరింత బలపడటానికి వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని తెలిపింది.

వచ్చే 48 గంటల్లో ఈ అల్పపీడనం క్రమంగా పశ్చిమ బెంగాల్, ఒడిశా ఉత్తర ప్రాంతం వైపు కదిలేందుకు అవకాశం ఉంది. దీని ప్రభావంతో కోస్తాంధ్రలో ఆదివారం వరకు అక్కడక్కడ భారీ వర్షాలు నమోదు కావడానికి అవకాశం ఉందని ఎస్డీఎంఏ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని సూచించారు.
పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. నేడు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని ప్రఖర్ జైన్ పేర్కొన్నారు.
విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడతాయని తెలిపారు. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసేందుకు ఆస్కారం ఉందని వివరించారు.
ఈ పరిణామాల నేపథ్యంలో- హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత సమీక్ష నిర్వహించారు. విపత్తు నిర్వహణ విభాగం మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్, ఇతర అధికారులతో కలిసి ఏపీ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ నుంచి వాతావరణ పరిస్థితులను పరిశీలించారు. ఈ వాయుగుండం ఈ సాయంత్రానికి పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ పరిసరాల్లో తీరం దాటే అవకాశముందని తెలిపారు.
ఆ సమయంలో సముద్రం అల్లకల్లోంగా ఉంటుందని, మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని వంగలపూడి అనిత సూచించారు. ఈ వాయుగుండం ప్రభావంతో శని, ఆదివారాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున నీటిపారుదల, ఆర్ అండ్ బీ, పంచాయతీ రాజ్ శాఖలతో సమన్వయం చేసుకొని గండ్లు, ఫ్లాష్ ఫ్లడ్ ప్రభావిత ప్రాంతాలను గుర్తించి అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
• బంగాళాఖాతంలో వాయుగుండం, భారీ వర్షాలపై హోం, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి అనిత సమీక్ష..
— Andhra Pradesh State Disaster Management Authority (@APSDMA) July 25, 2025
• పశ్చిమ బెంగాల్, ఆనుకుని ఉన్న బంగ్లాదేశ్ తీరాలను తాకిన వాయుగుండం
• ఏపీ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ నుంచి స్వయంగా పరిశీలించిన హోం మంత్రి అనిత... pic.twitter.com/2DFpvNxRVm
భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. అత్యవసర పరిస్థితుల్లో సహాయం కోసం కంట్రోల్ రూమ్ లో 112, 1070, 1800-4250101 టోల్ ఫ్రీ నంబర్లకు ఫోన్ చేయాలని వంగలపూడి అనిత సూచించారు. కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీవర్షాల నేపధ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు.
రాయలసీమ, కోస్తాలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడొచ్చని అన్నారు. తీరం వెంబడి గంటకు 40 నుంచి 60 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, మత్స్యకారులెవరూ కూడా సోమవారం వరకు సముద్రంపైకి చేపల వేటకు వెళ్ళరాదని అన్నారు. వర్షాలు, ఫ్లాష్ ఫ్లడ్ ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు చర్యలు చేపట్టాలని చెప్పారు.
బంగాళాఖాతంలో వాయుగుండం, రాష్ట్రంలో భారీ వర్షాలపై విపత్తు నిర్వహణ శాఖ కార్యాలయంలో సమీక్ష నిర్వహించడం జరిగింది. విపత్తు నిర్వహణ శాఖ ఎండీ శ్రీ ప్రఖార్ జైన్ గారు, ఇతర అధికారులతో కలిసి ఏపీ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ నుంచి వాతావరణ పరిస్థితులను పరిశీలించాము. సాయంత్రానికి పశ్చిమ బెంగాల్,… pic.twitter.com/xoSGhqzTEJ
— Anitha Vangalapudi (@Anitha_TDP) July 25, 2025












Click it and Unblock the Notifications